Sanju Samson Post Goes Viral Ahead of ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్‌తో వార్మప్ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు కేరళలోని తిరువనంతపురం వెళ్లిన విషయం తెలిసిందే. అయితే భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది. గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దైంది. అయితే భారత జట్టులో లేని కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.
తిరువనంతపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత ఆటగాళ్లు సాధన చేశారు. ఆ ప్రదేశం దగ్గరల్లో సంజూ శాంసన్ భారీ కటౌట్ ఉంది. శాంసన్ కటౌట్ ముందున్న నెట్స్‌లో భారత ఆటగాళ్లు సన్నద్ధమయ్యారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహ్మద్ సిరాజ్ తదితరులు శాంసన్ భారీ కటౌట్ ముందున్న నెట్స్‌లో బౌలింగ్ చేశారు. ఇందుకు సంబందించిన పోటోలను క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.
మరోవైపు సంజూ శాంసన్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి భారత జట్టుకు స్వాగతం చెబుతూ ఓ పోస్టు పెట్టాడు. ‘టీమిండియాతో ఇలా.. ఈ దైవ భూమిలో’ అని పేర్కొన్నాడు. అందుకు ఓ విక్టరీ సింబల్‌ను కూడా సంజూ జత చేశాడు. ఈ ట్వీట్ అందరి మనసులను గెలిచింది. ఇక సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ ఆడాలని ఆశపడ్డ సంజూకు బీసీసీఐ సెలక్టర్లు మొండిచేయి చూపిన విషయం తెలిసిందే. మిడిలార్డర్‌లో రాణించగల సత్తా ఉన్న సంజూను కాదని.. టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు.