Leading News Portal in Telugu

ICC Cricket World Cup: సెమీస్ చేరే నాలుగు జట్లు ఇవే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు దక్కని చోటు!


Michael Vaughan predicts 4 Semifinalists of ICC Cricket World Cup 2023: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచమంతా ‘ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023’ ఫీవర్‌తో ఊగిపోతోంది. మెగా టోర్నీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్ 2023 మరో కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానంలో అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టోర్నీలో ఏ జట్లు బలంగా ఉన్నాయి, ఏ టీమ్స్ సెమీస్‌కు చేరతాయి?, ఏ జట్టు టైటిల్‌ను గెలుస్తుంది? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు కూడా ప్రపంచకప్‌ 2023 ఎప్పుడెప్పుడూ ప్రారంభమవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఏ జట్లు సెమీస్‌ చేరతాయి?, ఏ జట్టు టైటిల్‌ను గెలుస్తుంది? అనే దానిపై తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌ తన అంచనాలను తెలిపాడు. ‘ఈ వారం ప్రపంచకప్ 2203 ప్రారంభమయ్యే వరకు వేచి ఉండలేను. నా అంచనా ప్రకారం.. భారత్, పాకిస్థాన్‌, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరతాయి అని వాన్‌ ఎక్స్‌లో పోస్టు చేశాడు. ఈ జాబితాలో బలమైన టీమ్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.

ఉపఖండ పిచెస్ కాబట్టి భారత్, పాకిస్థాన్‌ జట్లు సెమీస్‌కు చేరుతాయని మైఖేల్ వాన్‌ అంచనా వేశాడు. ఇక భారత జట్టుపై వాన్‌ ఇటీవల ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచకప్‌ 2023లో భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్‌ను గెలుస్తుందని అభిప్రాయపడ్డాడు. స్వదేశీ పిచ్‌లపై భారత బ్యాటింగ్‌ లైనప్‌ అద్భుతంగా ఉందని, వారి బౌలింగ్ ఆప్షన్లు అన్ని కవర్‌ అయ్యాయని పేర్కొన్నాడు. ఒత్తిడి మాత్రమే భారత్‌ను ఆపగలదని చెప్పాడు.