Leading News Portal in Telugu

Dipika Pallikal: స్క్వాష్‌లో భారత్‌కు స్వర్ణం.. 83కి చేరిన పతకాల సంఖ్య! టార్గెట్@100


India Wins 83 Medals in Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. స్క్వాష్‌లో భారత మిక్స్‌డ్ డబుల్స్ ద్వయం దీపికా పల్లికల్‌-హరిందర్‌ సంధు జోడీ గోల్డ్ మెడల్ సాధించారు. మలేషియాకు చెందిన ఐఫా బింటి అజ్మాన్ మరియు సయాఫిక్ కమల్‌ల జోడీని 11-10, 11-10 తేడాతో ఓడించారు. స్క్వాష్‌లో భారత్‌కు ఇది నాలుగో పతకం. పురుషుల జట్టు పాకిస్థాన్‌ను ఓడించి స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. మహిళల జట్టు, మిక్స్‌డ్‌ డబుల్స్‌ టీమ్ (అనాహత్‌, అభయ్‌సింగ్‌లు) కాంస్య పతకాలను కైవసం సాధించారు.

బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్‌ పతకం ఖాయం చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో మలేషియా ఆటగాడు జి జియాపై చివరి వరకూ పోరాడి 21-16, 21-23, 22-20 తేడాతో విజయం సాధించాడు. సీనియర్‌ స్క్వాష్‌ ప్లేయర్ సౌరభ్ గోషల్ సింగిల్స్‌ విభాగంలో పతకంపై కన్నేశాడు. అంతకుముందు ఆర్చరీలో కాంపౌండ్‌ మహిళల టీమ్‌ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం నెగ్గింది.

పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ సెమీస్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్‌లో భూటాన్‌పై 235-221 తేడాతో గెలిచింది. సెమీస్‌లో చైనీస్‌ తైపీతో భారత్‌ తలపడనుంది. మరోవైపు బాక్సర్లు అంతిమ్‌ పంగల్‌ (మహిళల 53 కేజీల విభాగం), మన్సి (మహిళల 50 కేజీల విభాగం) కాంస్య పతకం కోసం తలపడనున్నారు.

స్క్వాష్‌లో దీపికా పల్లికల్‌-హరిందర్‌ సంధు జోడీ గోల్డ్ మెడల్ సాధించడంతో భారత్‌ ఖాతాలో 20 పసిడి పతకం చేరింది. నేడు భారత్‌కు ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. ప్రస్తుతం భారత్‌ పతకాల సంఖ్య 83కి చేరింది. ఇందులో 20 స్వర్ణాలు, 31 రజతాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి. భారత అథ్లెట్లు 100 పతకాలు లక్ష్యంగా 2023 ఆసియా గేమ్స్‌లో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇంకా గేమ్స్ ఉన్న నేపథ్యంలో ఆ మార్క్ అందుకునే అవకాశం ఉంది.