KL Rahul React about century miss in IND vs AUS Match: తనకు సెంచరీ ముఖ్యం కాదని, జట్టు విజయమే ముఖ్యమని టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. సెంచరీ మిస్ అయినందుకు తానేం బాధపడడం లేదన్నాడు. క్రీజ్‌లోకి వెళ్లగానే తనను విరాట్ కోహ్లీ కాసేపు టెస్ట్ క్రికెట్‌లా ఆడమని చెప్పాడని రాహుల్ చెప్పాడు. చెన్నై వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ విజయంలో రాహుల్ (97 నాటౌట్; 115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పాత్ర పోషించాడు.
ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ… ‘2 పరుగులకే మూడు వికెట్లు పడినప్పుడు క్రీజ్‌లోకి వచ్చా. ఎక్కువగా కంగారు పడలేదు. విరాట్ కోహ్లీతో వికెట్ గురించి ఎక్కువగా చర్చించ లేదు. అయితే కోహ్లీ ఒకటే చెప్పాడు.. పిచ్ చాలా క్లిష్టంగా ఉంది, కాసేపు టెస్టు మ్యాచ్ ఆడు అని సూచించాడు. ఆరంభంలో కొత్త బంతి పేసర్లకు సహకరించింది. ఆ తర్వాత స్పిన్నర్లకూ సహకరించింది. అయితే చివరి 15-20 ఓవర్లప్పుడు మాత్రం తేమ ప్రభావంతో బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. దాంతో బౌలర్లకు బంతిపై పట్టు దొరకలేదు’ అని అన్నాడు.
‘దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా చెన్నై పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులభమేమీ కాదు. ఇది మంచి వికెట్. బ్యాటర్లు, బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టింది. చివరి సిక్స్‌ను అద్భుతంగా కొట్టా. సెంచరీ చేయడానికి ఎన్ని పరుగులు అవసరం?, ఎలా చేయాలి? అనే దానిపై నాకు అవగాహన ఉంది. భారత్ విజయానికి 5 పరుగులు అవసరం. ఫోర్, సిక్స్ కొడితే నా సెంచరీ పూర్తవుతుంది. అయితే చివరి బంతి నేరుగా స్టాండ్స్‌లో పడింది. సెంచరీ మిస్ అయినందుకు బాధలేదు. ఎందుకంటే జట్టు విజయం నాకు ముఖ్యం’ అని కేఎల్ రాహుల్ తెలిపాడు.