Telugu Titans Buy Pawan Sehrawat for 2.60 Crore in PKL 10 Auction: ఆసియా గేమ్స్ 2023లో భారత జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్ పవన్ కుమార్ సెహ్రావత్ చరిత్ర సృష్టించాడు. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పవన్ నిలిచాడు. పీకేఎల్ సీజన్-10 కోసం జరిగిన వేలంలో తెలుగు టైటాన్స్ జట్టు అతడిని రూ. 2.60 కోట్లకు కొనుగోలు చేసింది. ఇరాన్ స్ట్రైకర్ మహ్మద్‌రెజా షాడ్‌లౌయ్ చియానెహ్ రికార్డును పవన్ బ్రేక్ చేశాడు. గత సీజన్లలో పలు ఆటగాళ్లను ప్రయత్నించిన తెలుగు టైటాన్స్.. ఈసారి రైడర్ పవన్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. డిసెంబర్ 2న ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10 ఆరంభం కానుంది.
గత సీజన్‌లో తమిళ్ తలైవాస్ జట్టు పవన్ కుమార్ సెహ్రావత్‌ను రూ. 2.26 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈసారి తెలుగు టైటాన్స్ అంతకుమించిన మొత్తంతో అతడిని సొంతం చేసుకుంది. స్టార్ రైడర్ కావడం, హై-ఫ్లైయర్ అనే ముద్ర ఉండడంతో పవన్‌కు ఇంత ధర దక్కింది. ఇరాన్ స్టార్ మహ్మద్‌రెజా చియానెహ్ (రూ.2.35 కోట్లు) రెండో ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు ఎక్కువ మొత్తం పలికిన విదేశీ ఆటగాడు కూడా అతడే. పీకేఎల్ 10 వేలంలో రెజాను పుణెరి పల్టాన్ కైవసం చేసుకుంది.
మణిందర్ సింగ్‌ను బెంగాల్ వారియర్స్ రూ.2.12 కోట్లకు సొంతం చేసుకుంది. ఫజల్ అత్రాచలి (గుజరాత్ టైటాన్స్, 1.60 కోట్లు), సిద్ధార్థ్ దేశాయ్ (హరియాణా స్టీలర్స్, రూ.కోటి), మీటూ శర్మ (యూ ముంబా, రూ.93 లక్షలు), విజయ్ మలిక్ (యూపీ యోధాస్, రూ.85 లక్షలు), గమాన్ (దబంగ్ ఢిల్లీ, రూ.85 లక్షలు), చంద్రన్ రంజిత్ (హరియాణా స్టీలర్స్, రూ.62 లక్షలు), రోహిత్ గులియా (గుజరాత్ టైటాన్స్, రూ.58.50 లక్షలు)భారీ ధరలు పలికారు.