
Virat Kohli, Naveen Ul Haq Bromance Video Goes Viral In IND vs AFG Match: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, తాను ఇకపై మంచి దోస్తులం అని అఫ్గానిస్థాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ తెలిపాడు. ఇన్నాళ్లు తమ మధ్య జరిగిన గొడవకు గుడ్ బై చెప్పామని పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీ గొప్ప ఆటగాడని నవీన్ కొనియాడాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా హాగ్ చేసుకున్న కోహ్లీ, నవీన్.. తమ శత్రుత్వానికి ముగింపు పలికారు.
మ్యాచ్ అనంతరం నవీన్ ఉల్ హక్ మాట్లాడుతూ… ‘ప్రపంచ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ గొప్ప ఆగడు. అంతటి గొప్ప ఆటగాడితో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. మేం ఇద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం. ఇక నుంచి మేం మంచి స్నేహితులుగా ఉంటాం. మైదానంలో జరిగింది అక్కడి వరకే. బయట మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఈ మ్యాచ్ సందర్భంగా ఇద్దరం కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం. మా మధ్య ఉన్న బేధాభిప్రాయాలకు ముగింపు పలికాం’ అని అన్నాడు.
భారత్, అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో నవీన్ ఉల్ హక్‌ను విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకున్నారు. నవీన్ మైదానంలోకి వచ్చినప్పటి నుంచి ‘కోహ్లీ.. కోహ్లీ’ అని అరిచారు. ఇక విరాట్ బ్యాటింగ్ చేసేందుకు రాగానే.. ఆ అరుపులు మరింత ఎక్కువయ్యాయి. ఇది గమనించిన విరాట్ అలా అనొద్దంటూ అభిమానులకు సైగ చేశాడు. ఆటగాళ్లను ఎంకరేజ్ చేయాలే తప్ప.. ట్రోల్ చేయవద్దని కోరాడు. దాంతో ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడం ఆపేసారు. ఆపై నవీన్ వచ్చి కోహ్లీని హగ్ చేసుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 26వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐపీఎల్ 2023లో బెంగళూరు, లక్నో మ్యాచ్ సందర్భంగా నవీన్, కోహ్లీకి మధ్య వాగ్వాదం జరిగింది. కోహ్లీ పదే పదే పిచ్‌పై పరుగెడుతున్నాడని నవీన్ అంపైర్లకు ఫిర్యాదు చేయడమే ఈ గొడవకు కారణమైంది.