Leading News Portal in Telugu

India vs Pakistan: జస్ప్రీత్ బుమ్రా, షహీన్‌ ఆఫ్రిదిలలో ఎవరు డేంజరస్‌?.. బీజేపీ ఎంపీ సమాధానం ఇదే!


India vs Pakistan: జస్ప్రీత్ బుమ్రా, షహీన్‌ ఆఫ్రిదిలలో ఎవరు డేంజరస్‌?.. బీజేపీ ఎంపీ సమాధానం ఇదే!

Gautam Gambhir Says Jasprit Bumrah is dangerous Pacer than Shaheen Afridi: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా నేడు మెగా సమరం జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలానే భారత్ బ్యాటింగ్, పాకిస్తాన్ బౌలింగ్ మధ్య సమరం జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత స్టార్‌ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్ షహీన్‌ షా ఆఫ్రిది ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరిద్దరిలో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

జస్ప్రీత్ బుమ్రా, షహీన్‌ షా ఆఫ్రిదిలలో అత్యంత ప్రమాదకరం ఎవరనే దానిపై భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్ స్పందించారు. బుమ్రా డేంజరస్‌ బౌలర్ అని పేర్కొన్నారు. ‘చెన్నై పిచ్‌ మీద ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్‌ మార్ష్‌ను జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేసిన విధానం అద్భుతం. అఫ్గాన్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జాద్రాన్‌ను కూడా అదే రీతిలో బోల్తా కొట్టించాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్‌గా బుమ్రానే’ అని గౌతీ స్టార్ స్పోర్ట్స్‌లో అన్నారు.

‘జస్ప్రీత్ బుమ్రా, షహీన్‌ షా ఆఫ్రిదిలను పోలుస్తూ చాలా మంది విశ్లేషణలు చేస్తున్నారు. ఇద్దరి బౌలింగ్‌లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రతి దశలోనూ బంతితో అద్భుతాలు చేసే బౌలర్ చాలా అరుదుగా ఉంటారు. కొందరు బౌలర్లు కొత్త బంతితో లేదా డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేస్తారు. అయితే బుమ్రా కొత్త బంతి లేదా పాత బంతితో మిడిల్ ఓవర్లలో కూడా అదే ప్రభావాన్ని చూపుతాడు. బంతి కొత్తదా? పాతదా?.. ఏ ఓవర్ అనేది అతడికి అనవసరం. అయితే షహీన్‌ ఆఫ్రిదిలో ఈ లక్షణాలు లేవు. అందుకే బుమ్రా అత్యంత ప్రమాదకరం’ అని గౌతమ్‌ గంభీర్ వివరణ ఇచ్చారు.