Leading News Portal in Telugu

ICC: ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ ప్రకటించిన ఐసీసీ.. ఆ స్టార్ ప్లేయర్ను వరించిన టైటిల్


ICC: ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ ప్రకటించిన ఐసీసీ.. ఆ స్టార్ ప్లేయర్ను వరించిన టైటిల్

సెప్టెంబర్ 2023కి సంబంధించి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ని ఐసీసీ ప్రకటించింది. ఈసారి శుభ్‌మాన్ గిల్‌ను ఈ నెల ఉత్తమ ఆటగాడిగా ఎంపిక చేశారు. సహచర ఆటగాడు మహ్మద్ సిరాజ్, ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్‌లను పక్కకు నెట్టి శుభ్‌మాన్ ఈ టైటిల్‌ను సాధించాడు. సెప్టెంబర్ నెలలో గిల్ అద్భుతమైన బ్యాటింగ్ సగటు 80తో 480 పరుగులు చేశాడు. సెప్టెంబర్‌లో ఆడిన ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆసియా కప్‌లో.. అతను 75.5 బ్యాటింగ్ సగటుతో 302 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లలో గిల్ 178 పరుగులు చేశాడు.

సెప్టెంబరులో గిల్ రెండు సెంచరీలు చేశాడు. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ, రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై రెండో సెంచరీ సాధించాడు. అంతేకాకుండా.. మూడు అర్ధ సెంచరీలు కూడా చేశాడు. సెప్టెంబరులో ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో అతను కేవలం రెండుసార్లు మాత్రమే 50 పరుగుల కంటే తక్కువ పరుగులకే ఔటయ్యాడు.ఇప్పటి వరకు శుభ్‌మాన్ గిల్ వన్డే రికార్డు అద్భుతంగా ఉంది. 24 ఏళ్ల శుభ్‌మన్ 35 వన్డేల్లో 66.1 బ్యాటింగ్ సగటుతో 1917 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 102.84. ప్రస్తుతం అతను ICC ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-2 ర్యాంక్‌లో ఉన్నాడు. ప్రస్తుతం గిల్.. డెంగ్యూ నుండి పూర్తిగా కోలుకోకపోవడంతో 2023 ప్రపంచ కప్‌లో టీమిండియా తరపున మొదటి రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అక్టోబరు 14న జరిగే భారత్‌-పాకిస్థాన్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ఓపెనింగ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.