Leading News Portal in Telugu

Alastair Cook: క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్..!


Alastair Cook: క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్..!

ఇంగ్లండ్‌ దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ అలిస్టర్‌ కుక్‌ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ పలికాడు. కొన్నాళ్ల పాటు ఇంగ్లండ్‌ జట్టుకు కెప్టెన్ గా, బ్యాట్స్ మెన్ గా తన సేవలు అందించాడు. 2018 సెప్టెంబర్ లోనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ పలికినప్పటికీ.. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌లో ఆడాడు. ఇప్పుడు తన 38 ఏళ్ల వయస్సులో అన్ని రకాల ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లండ్ తరఫున టెస్టు ఫార్మాట్‌లో పదివేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్ గా అలిస్టర్ కుక్ ఉన్నాడు.

అలిస్టర్ కుక్ క్రికెట్‌లో వేల పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 161 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 291 ఇన్నింగ్స్‌లలో 12,472 పరుగులు చేశాడు. అతని సగటు 45.35 కాగా.. బెస్ట్ స్కోరు 294 పరుగులు ఉన్నాయి. కుక్ తన టెస్టు కెరీర్‌లో 33 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక వన్డేలలో 92 మ్యాచ్‌లలో 92 ఇన్నింగ్స్‌లలో 36.40 సగటు, 77.13 స్ట్రైక్ రేట్‌తో 3204 పరుగులు చేశాడు. వన్డేలలో 5 సెంచరీలు, 19 అర్ధ సెంచరీలు చేశాడు. ఇక టీ20ల్లో కేవలం 4 మ్యాచ్‌లు ఆడి 61 పరుగులు చేశాడు.

ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌లో అలిస్టర్ కుక్ కు మంచి కెరీర్ ఉంది. అతను మొత్తం 352 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాగా.. 619 ఇన్నింగ్స్‌లలో 46.41 సగటుతో 26,643 పరుగులు చేశాడు. అంతేకాకుండా.. కుక్ 74 సెంచరీలు, 125 అర్ధ సెంచరీలు చేశాడు. కుక్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో మొత్తం 386 క్యాచ్‌లు పట్టాడు. 2006లో నాగ్‌పూర్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున కుక్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించి.. దేశీయ క్రికెట్ పై దృష్టి పెట్టాడు.