Leading News Portal in Telugu

Virat Kohli: మ్యాచ్ మధ్యలో డగౌట్‌కు పరుగెత్తిన విరాట్ కోహ్లీ.. కారణం ఏంటో తెలుసా?


Virat Kohli: మ్యాచ్ మధ్యలో డగౌట్‌కు పరుగెత్తిన విరాట్ కోహ్లీ.. కారణం ఏంటో తెలుసా?

Virat Kohli forgets to wear Correct Jersey in India vs Pakistan Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యవసరంగా డగౌట్‌కు పరుగెత్తాడు. జెర్సీ కారణంగా విరాట్ మైదానాన్ని ఉన్నపళంగా వీడాల్సి వచ్చింది. భారత్ ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో తప్పు జెర్సీ వేసుకోవడంతో.. కోహ్లీ పెవిలియన్‌కు పరుగెత్తి జెర్సీ మార్చుకుని వచ్చాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా భారత జట్టు కిట్‌ స్పాన్సర్‌ ‘అడిడాస్‌’కు సంబంధించిన మూడు అడ్డ గీతలు ఆటగాళ్ల జెర్సీల భుజాలపై తెల్ల రంగులో కనిపిస్తాయి. అయితే ప్రపంచకప్‌ 2023 కోసం భారత్ ఆటగాళ్లకు భుజంపై మువ్వన్నెల గుర్తు ఉండే జెర్సీని రూపొందించారు. కానీ విరాట్‌ కోహ్లీ పొరపాటున తెలుపు గీతల టీ షర్ట్‌ (తెల్ల స్ట్రిప్స్‌ ఉన్న జెర్సీ)తోనే వచ్చేశాడు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌ ముగిశాక పొరపాటును గుర్తించిన కోహ్లీ.. డగౌట్‌కు వెళ్లి జెర్సీ మార్చుకుని వచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే షఫీఖ్‌ను మొహ్మద్ సిరాజ్‌ ఔట్‌ చేసి భారత్‌కు మొదటి వికెట్‌ అందించాడు.

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్.. హ్యాట్రిక్ విజయం సాధించింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌.. 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్‌ 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌట్ అయింది. బాబర్‌ అజామ్‌ (50; 58 బంతుల్లో 7×4), మహమ్మద్‌ రిజ్వాన్‌ (49; 69 బంతుల్లో 7×4) రాణించారు. స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్‌ శర్మ (86; 63 బంతుల్లో 6×4, 6×6), శ్రేయస్‌ అయ్యర్‌ (53 నాటౌట్‌; 62 బంతుల్లో 3×4, 2×6) హాఫ్ సెంచరీలు చేశారు.