Leading News Portal in Telugu

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌ విజేత భారత్‌.. రికీ పాంటింగ్‌ జోస్యం!


ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌ విజేత భారత్‌.. రికీ పాంటింగ్‌ జోస్యం!

Ricky Ponting Says India Extremely Hard To Beat for Any Team: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 విజేతగా టీమిండియా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ జోస్యం చెప్పాడు. మెగా టోర్నీ స్వదేశంలో జరుగుతుండటం భారత్‌కు కలిసొస్తోందని, బలమైన జట్టుతో బరిలోకి దిగడం కూడా సానుకూలాంశంగా పేర్కొన్నాడు. భారత్‌ను ఓడించడమంటే ఇతర జట్లకు చాలా కష్టమని పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌ 2023లో రోహిత్ సేన హ్యాట్రిక్‌ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆసీస్, అఫ్గాన్‌, పాక్‌లపై భారత్ సునాయాస విజయాలు అందుకుంది.

రికీ పాంటింగ్‌ తాజాగా ఐసీసీ ఈవెంట్‌లో మాట్లాడుతూ… ‘భారత్‌ను ఓడించడం చాలా కష్టం అని ప్రపంచకప్ ప్రారంభానికి ముందు నుంచే చెబుతున్నా. భారత్ ప్రతిభావంతులైన జట్టును కలిగి ఉంది. ఫాస్ట్‌, స్పిన్‌ బౌలింగ్‌.. టాప్‌ ఆర్డర్‌, మిడిలార్డర్‌ అన్నీ బలంగా ఉన్నాయి. అందుకే టీమిండియాను ఎదుర్కోవడం ఏ జట్టుకైనా కష్టమే. అయితే టోర్నీ ముగింపు నాటికి ఉండే తీవ్ర ఒత్తిడిని తట్టుకుని ఇదే ఊపును ఎలా కొనసాగిస్తుందో చూడాలి. ఒత్తిడిని అధిగమించడమే ఇక్కడ కీలకం’ అని అన్నాడు.

‘రోహిత్ శర్మ ఆడుతున్న తీరును చూస్తే.. జట్టుకు అతడు ఎంత బలంగా మారాడో ఇట్టే అర్థమైపోతుంది. బ్యాటింగ్‌లో రాణిస్తూనే.. జట్టును కూడా ముందుండి నడిపిస్తున్నాడు. అది అద్భుతం అనే చెప్పాలి. అయితే టోర్నీ సాగే కొద్దీ ఒత్తిడి వారిపై ఉండదని కాదు. ఒత్తిడిని ముందుగా రోహిత్ తీసుకుని.. మిగతా వారూ దాన్ని ఎదుర్కొనేలా సిద్ధంగా ఉంచుతాడు. రోహిత్ అద్భుత నాయకత్వంతో విరాట్ కోహ్లీ వంటి వారికి మరింత స్వేచ్ఛ లభిస్తోంది. వారు తమ బ్యాటింగ్‌పైనే దృష్టిపెట్టేందుకు అవకాశం లభించింది. రోహిత్ సారథ్యంలో భారత్‌ విజేతగా నిలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి’ అని రికీ పాంటింగ్‌ చెప్పుకొచ్చాడు.