Leading News Portal in Telugu

Rohit Sharma Bowling: బంతి పట్టిన రోహిత్ శర్మ.. బంగ్లాకు చుక్కలు తప్పవా?


Rohit Sharma Bowling: బంతి పట్టిన రోహిత్ శర్మ.. బంగ్లాకు చుక్కలు తప్పవా?

Rohit Sharma Bowls in practice session ahead of IND vs BAN Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీ కొడుతుంది. అక్టోబర్ 19న పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, బంగ్లా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం పూణె చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌ చేస్తోంది.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు భారత జట్టు మంగళవారం నెట్స్‌లో శ్రమించింది. జట్టు సభ్యులందరూ బౌలింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్‌ చేశారు. అయితే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్ బదులుగా బౌలింగ్‌ సాధన చేయడం విశేషం. ఇందుకు సంబందించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘బంగ్లాకు చుక్కలు తప్పవా?’, ‘బంగ్లాతో మ్యాచ్‌లో రోహిత్ ఏదో సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేస్తున్నట్లున్నాడే’ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

జట్టులో సరైన స్పిన్ ఆల్‌రౌండర్‌ లేరని, సాధ్యమైనంత మంది ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగుతామని వన్డే ప్రపంచకప్ 2023కి ముందు రోహిత్ శర్మ అన్న విషయం తెలిసిందే. జట్టు కోసం అవసరమైతే తాను బౌలింగ్ వేయడానికి సిద్ధంగా ఉంటానన్నాడు. ఇప్పుడు రోహిత్ బంతి పట్టుకోవడంతో బంగ్లాతో మ్యాచ్‌లో రోహిత్ బౌలింగ్ చేస్తాడని ఫాన్స్ ఆశిస్తున్నారు. ఇప్పటివరకు టోర్నీలో బ్యాట్‌తో ప్రత్యర్థుల దుమ్ము దులిపిన రోహిత్.. ఇప్పుడు బంతితోనూ మాయ చేస్తాడేమో చూడాలి?. రోహిత్ గతంలో స్పిన్ బౌలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఇక నాలుగు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఆడిన భారత పేస్‌ ద్వయం జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్‌లలో ఒకరికి బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సీనియర్ పేసర్ మహ్మద్‌ షమీ తుది జట్టులోకి రానున్నాడు. మంగళవారం నెట్స్‌లో షమీ శ్రమించాడు. మరోవైపు బంగ్లా ప్రాక్టీస్‌ సెషన్లో ఆ జట్టు కెప్టెన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ పాల్గొన్నాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఈ ఆల్‌రౌండర్‌ ఎడమ కాలికి గాయమైన విషయం తెలిసిందే. భారత్‌తో మ్యాచ్‌లో షకిబ్‌ ఆడే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.