
Netherlands Captain Scott Edwards Says We Will Win few more Matches in ODI World Cup 2023: భారత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో తాము భారీ అంచనాలతో బరిలోకి దిగాం అని నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ తెలిపాడు. భీకర ఫామ్‌లో ఉన్న అగ్రశేణి జట్టు దక్షిణాఫ్రికాపై విజయం సాధించడం చాలా గర్వంగా ఉందని, మరిన్ని షాక్‌లు (మరిన్ని విజయాలు) ఇస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ధర్మశాలలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ భారీ షాక్ ఇచ్చింది. ప్రొటీస్‌పై 38 పరుగుల తేడాతో గెలిచి.. ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని అందుకుంది.
మ్యాచ్ అనంతరం నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ… ‘చాలా గర్వంగా ఉంది. భారీ అంచనాలతో వన్డే ప్రపంచకప్ 2023కు వచ్చాం. జట్టులో చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారు. తొలి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. మరికొన్ని విజయాలు సాధిస్తామనే నమ్మకం ఉంది. మేము కొన్ని ప్రణాళికలతో ముందుకు వచ్చాం. అవి కొన్ని మ్యాచ్‌లలో సఫలం కావొచ్చు, మరికొన్ని మ్యాచ్‌లలో విఫలం కావొచ్చు’ అని అన్నాడు.
‘ప్రపంచకప్ 2023లో మేము తొలి రెండు మ్యాచ్‌ల్లో కూడా మంచి పొజిషన్లో ఉన్నాం. మ్యాచ్ జరిగే కొద్ది మేము పట్టు కోల్పోయాం. దాంతో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యాం. ఈ విజయాన్ని వదిలి తదుపరి మ్యాచ్‌లపై దృష్టి సారిస్తాం’ అని నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ పేర్కొన్నాడు. నెదర్లాండ్స్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో డచ్ టీం ఎనిమిదో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల కంటే నెదర్లాండ్స్ మెరుగైన స్థితిలో ఉండటం విశేషం. నెదర్లాండ్స్ తమ తదుపరి మ్యాచ్ అక్టోబర్ 21న లక్నోలో శ్రీలంకతో ఆడుతుంది.