Leading News Portal in Telugu

Rohit Sharma: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌.. వివాదంలో రోహిత్‌ శర్మ!


Rohit Sharma: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌.. వివాదంలో రోహిత్‌ శర్మ!

Rohit Sharma Issued 3 Traffic Challans For Over Speed ahead of IND vs BAN Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు పూణే ట్రాఫిక్ పోలీసులు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఊహించని షాక్ ఇచ్చారు. ముంబై-పూణే హైవేపై పరిమితికి మించిన వేగంతో కారును నడిపినందుకు రోహిత్‌కు చలాన్లు విధించారు. హిట్‌మ్యాన్‌ గంటకు 200 కిమీ కంటే ఎక్కువ వేగంతో డ్రైవింగ్ చేసినట్లు సమాచారం తెలుస్తోంది.

అక్టోబర్ 14న పాకిస్తాన్‌తో మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లకు 5 రోజుల బ్రేక్ లభించింది. పాక్‌ మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అహ్మదాబాద్‌ నుంచి హెలిక్యాప్టర్‌లో ముంబైకి చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు రెండు రోజుల పాటు కుటుబంతో కలిసి గడిపిన రోహిత్.. పూణేలో భారత జట్టుతో కలిసేందుకు ముంబై నుంచి తన లంబోర్గిని ఉరుస్ కారులో బయలుదేరాడు. ముంబై-పూణే హైవేపై రోహిత్ పరిమితికి మించిన వేగంతో దూసుకుపోయాడట. ఒక దశలో రోహిత్‌ కారు 215 కిమీ వేగాన్ని అందుకుందట. వేర్వేరు ప్రదేశాల్లో పరిమితికి మించిన వేగంతో కారు వెళ్లినందుకు కారు యజమాని అయిన రోహిత్‌కు ట్రాఫిక్ పోలీసులు మూడు చలానాలు వేశారు.

వేగంగా వెళ్తున్న రోహిత్‌ శర్మ కారును ఓ పోలీస్‌ ఉన్నతాధికారి అడ్డుకున్నాడట. పోలీసు ఎస్కార్ట్‌తో జట్టు బస్సులో ప్రయాణించాలని ఆ అధికారి సూచించారట. ఇక రోహిత్‌ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వన్డే ప్రపంచకప్‌ 2023లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌.. 217 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌పై కూడా హిట్‌మ్యాన్‌ చెలరేగాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ప్రపంచకప్‌లో రోహిత్ అత్యధికంగా 7 సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. రోహిత్‌ ఫామ్ చూస్తుంటే.. ఈ ప్రపంచకప్‌లోనే మరో 2-3 శతకాలు బాదినా ఆశ్చర్యపోనక్కర్లేదు.