Leading News Portal in Telugu

IND vs BAN: అమ్మో అక్కడుంది విరాట్ కోహ్లీ.. అస్సలు స్లెడ్జింగ్‌ చేయను: ముష్పీకర్ రహీమ్‌


IND vs BAN: అమ్మో అక్కడుంది విరాట్ కోహ్లీ.. అస్సలు స్లెడ్జింగ్‌ చేయను: ముష్పీకర్ రహీమ్‌

Mushfiqur Rahim Said Virat Kohli always tries to sledge me: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని తాను ఎప్పుడూ స్లెడ్జింగ్‌ చేయను అని బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్పీకర్ రహీమ్‌ తెలిపాడు. స్లెడ్జింగ్‌ కోహ్లీలో మరింత ఉత్సాహన్ని కలిగిస్తుందని, అప్పుడు విరాట్ ఇంకా దూకుడుగా ఆడతాడన్నాడు. స్లెడ్జింగ్ చేయకుండా వీలైనంత త్వరగా అతడిని వదిలించుకోవాలని తమ బౌలర్లకు చెప్తానని రహీమ్‌ చెప్పాడు. వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా గురువారం మధ్యాహ్నం భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో బంగ్లాదేశ్‌ కీపర్ ముష్పీకర్ రహీమ్‌ పలు విషయాలపై స్పందించాడు.

టీమిండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీని స్లెడ్జ్‌ చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు ‘అమ్మో అక్కడుంది కింగ్ కోహ్లీ.. నేనెప్పుడూ అతడిని స్లెడ్జ్‌ చేయను’ అని ముష్పీకర్ రహీమ్‌ తెలిపాడు. అందుకు గల కారణాన్ని కూడా బంగ్లాదేశ్ వికెట్ కీపర్ వెల్లడించాడు. ‘ప్రపంచ క్రికెట్‌లో కొంతమంది బ్యాటర్లు స్లెడ్జింగ్‌ను బాగా ఇష్టపడతారు. స్లెడ్జింగ్‌ చేస్తే వారు మరింత ఉత్సాహంగా ఆడతారు. ఈ విషయంలో విరాట్‌ కోహ్లీ ముందువరసలో ఉంటాడు. అందుకే నేను ఎప్పుడూ కోహ్లీని స్లెడ్జ్ చేయను. స్లెడ్జింగ్ చేస్తే కోహ్లీ మరింత రెచ్చిపోయి ఆడతాడు. స్లెడ్జింగ్ చేయకుండా వీలైనంత త్వరగా కోహ్లీని ఔట్ చేయాలనీ మా బౌలర్లకు చెప్తాను’ అని ముష్పీకర్ పేర్కొన్నాడు.

‘నేను భారత్‌తో బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారీ విరాట్ కోహ్లీ నన్ను స్లెడ్జ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కోహ్లీ పోటీతత్వం గల క్రికెటర్‌. ఏ మ్యాచ్‌లోనూ తన జట్టు ఓడిపోవాలనుకోడు. కోహ్లీలో ఉన్న ఆ పోటీని, భారత్‌ను ఎదుర్కోవడంలో ఎదురయ్యే సవాల్‌ నాకెంతో ఇష్టం. ప్రపంచకప్‌ 2023లో భాగంగా నేను టీమిండియాతో రేపు మ్యాచ్ ఆడబోతున్నా. చాలా ఆసక్తిగా ఉన్నా’ అని ముష్పీకర్ రహీమ్‌ చెప్పాడు. బంగ్లాదేశ్‌తో 26 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 65.31 సగటుతో 1437 పరుగులు చేశాడు. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన భారత్.. నాలుగో విజయంపై కన్నేసింది.