Leading News Portal in Telugu

Virat Kohli: సిక్స్ తో సెంచరీ కొట్టి మ్యాచ్ ముగించిన విరాట్ కోహ్లీ.. 48వ శతకం నమోదు


Virat Kohli: సిక్స్ తో సెంచరీ కొట్టి మ్యాచ్ ముగించిన విరాట్ కోహ్లీ.. 48వ  శతకం నమోదు

భారత స్టార్ బ్యాటర్‌, రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డ్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానానికి కోహ్లీ ఎగబాకాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్దనే పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లి బద్దలు కొట్టాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో పుణేలో నేడు (గురువారం) జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనతను నమోదు చేశాడు.

అయితే, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ కలిసి దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. మొదటి ఓవర్ నుంచి బౌండరీల మోత మోగించిన రోహిత్ శర్మ 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి… హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలో హసన్ మహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడి బౌండరీ లైన్ దగ్గర తోహిద్ హృదయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక, క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. అయితే, కోహ్లీ 73 పరుగుల వద్ద ఉన్నప్పుడు టీమిండియా విజయానికి 28 పరుగులే కావాలి.. ఆ తర్వాతి ఓవర్‌లో సిక్సర్ బాది 80ల్లోకి వచ్చిన విరాట్.. ఇన్నింగ్స్ 40వ ఓవర్‌లో ఓ 4, 6 బాది 11 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లో 2, 2, 1 పరుగులు తీసిన కోహ్లీ… టీమిండియా విజయానికి 2 పరుగులు కావాల్సిన సమయంలో సిక్సర్ బాది వన్డేల్లో తన 48వ సెంచరీ అందుకున్నాడు. కాగా, టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 రన్స్ చేసింది.