Leading News Portal in Telugu

IND vs BAN: అందులో తప్పేముంది.. ప్రతి రోజూ ఆ అవకాశం రాదు: సన్నీ



Virat Kohli Fire

Sunil Gavaskar React on Virat Kohli’s Controversal Century: బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (97 బంతుల్లో 103 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుత సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ​విరాట్ సెంచరీ చేసినా.. విమర్శలను ఎదుర్కోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సెంచరీ చేసేందుకే స్ట్రయిక్‌ రొటేట్‌ చేయకుండా స్వార్ధంగా ఆడాడని, విరాట్ సెంచరీకి అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బొరో వైడ్‌ ఇ‍వ్వకుండా కూడా సహకరించాడని నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విమర్శలపై భారత మాజీ క్రికెటర్స్ సునీల్ గవాస్కర్, క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ స్పందించారు.

ప్రతి రోజూ సెంచరీ చేసే అవకాశం రాదని, విరాట్ కోహ్లీ చేసిన దాంట్లో తప్పేముంది? అని సునీల్ గవాస్కర్ ప్రశ్నించాడు. ‘విరాట్ కోహ్లీ 70-80 స్కోరు వద్ద ఉన్నప్పుడు సెంచరీ చేసేందుకు అవకాశం ఉందని గ్రహించాడు. ఆ అవకాశాన్ని అతడు వదులుకోకూడదని భావించాడు. కేఎల్ రాహుల్ కూడా ప్రోత్సహించాడు. అందులో తప్పేముంది?. ఏ ఆటగాడికైనా ప్రతి రోజూ సెంచరీ చేసే అవకాశం రాదు’ అని సన్నీ అన్నాడు. కోహ్లీ 74 పరుగులతో ఉన్నప్పుడు భారత్ విజయానికి 27 పరుగులు అవసరం. ఆ తర్వాత కేఎల్ రాహుల్‌ ఒక్క బంతి మాత్రమే ఆడాడు. మరోవైపు విరాట్ 97 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఉండగా.. బంగ్లా బౌలర్‌ నసుమ్‌ అహ్మద్‌ లైగ్‌ సైడ్‌ దిశగా వైడ్‌ బాల్‌ వేశాడు. దాన్ని అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బొరో వైడ్ ఇవ్వలేదు.

Also Read: Umpire Richard Kettleborough: విరాట్ కోహ్లీ సెంచరీకి కారణం అంపైర్.. అతడికి మెడల్ ఇవ్వాలి!

‘క్రికెట్‌ను అర్థం చేసుకోని (క్రికెట్‌ పరిజ్ఞానం లేని) వ్యక్తులను నేను ప్రశ్నిస్తున్నా.. విరాట్ కోహ్లీ చేసిన దాంట్లో తప్పేముంది. ప్రపంచకప్‌లో సెంచరీ చేయడం మాములు విషయం కాదు. సెంచరీ చేసేందుకు కోహ్లీ అర్హుడు. టీమ్ మ్యాన్‌ కేఎల్ రాహుల్‌కి ధన్యవాదాలు. చెన్నైలో ఆస్ట్రేలియాపై రాహుల్ అద్భుతంగా ఆడాడు. భారత్, బంగ్లా మ్యాచ్ ఆనందించండి’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ పేర్కొన్నారు.