Leading News Portal in Telugu

Hardik Pandya Ruled Out: టీమిండియాకు షాక్‌.. హార్దిక్‌ పాండ్యా ఔట్!


Hardik Pandya Ruled Out: టీమిండియాకు షాక్‌.. హార్దిక్‌ పాండ్యా ఔట్!

BCCI Confirms Hardik Pandya Ruled Out vs New Zealand Clash: వన్డే ప్రపంచకప్‌ 2023 టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా హార్దిక్‌ గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.

‘భారత్ వైస్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడ్డాడు. స్కానింగ్‌ అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. బీసీసీఐ వైద్య బృందం నిరంతరం అతడిని పర్యవేక్షిస్తోంది. అక్టోబర్ 22న ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో హార్దిక్ ఆడటం లేదు. అక్టోబర్ 29న ఇంగ్లండ్‌తో పోరుకు లక్నో చేరుకుంటాడు’అని బీసీసీఐ పేర్కొంది. కీలక న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు ముందు హార్దిక్‌ దూరమవడం టీమిండియాకు ఎదురుదెబ్బే అని చెప్పాలి.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తూ హార్దిక్‌ పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే. కేవలం మూడు బంతులను మాత్రమే వేసి.. డగౌట్‌కు వెళ్లిపోయాడు. మిగతా ఓవర్‌ను విరాట్ కోహ్లీ పూర్తి చేశాడు. ఆ మ్యాచ్‌ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ హార్దిక్‌ విషయంలో ఆందోళన అవసరం లేదన్నాడు. అయితే తాజాగా బీసీసీఐ హార్దిక్‌ వచ్చే మ్యాచ్‌లో ఆడటం లేదని స్పష్టం చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన హార్దిక్.. లిటన్‌ దాస్‌ కొట్టిన స్ట్రెయిట్‌ డ్రైవ్‌ ఆపేందుకు ప్రయత్నించగా అతడి చీలమండ బెణికింది. జారి కిందపడ్డ హార్దిక్ తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు. సరిగ్గా కూడా నిలబడలేకపోయాడు. చికిత్స అనంతరం బౌలింగ్‌ చేద్దామని ప్రయత్నించినా.. అతని వల్ల కాలేదు. దీంతో మైదానాన్ని వీడక తప్పలేదు.