
KL Rahul Says I encouraged Virat Kohli to hit Century in IND vs BAN Match: ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం పూణేలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ విజయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ (103 నాటౌట్; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కీలక పాత్ర పోషించాడు. భారత్ విజయానికి రెండు పరుగులు అవసరం అయిన సమయంలో కోహ్లీ సిక్స్ బాది టీమిండియాకు విజయాన్ని అందించడంతో పాటు సెంచరీ మార్క్ కూడా అందుకున్నాడు. అయితే కోహ్లీ తాను సెంచరీ చేస్తానని ఊహించలేదు. శతకం చేసే అవకాశం ఉన్నా కోహ్లీ వద్దనుకున్నాడు. అయితే మరో బ్యాటర్ కేఎల్ రాహుల్ పట్టుబట్టడంతో చివరకు శతకాన్ని అందుకున్నాడు.
సింగిల్స్ తీయకుంటే వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతున్నానని జనాలు నన్ను తిడుతారని విరాట్ కోహ్లీ తనతో అన్నాడని మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ తెలిపాడు. ‘విరాట్ కోహ్లీ సింగిల్ తీసేందుకు ప్రయత్నిస్తే.. నేను వద్దని చెప్పా. సెంచరీ చెయ్ అని చెప్పా. అప్పుడు సింగిల్స్ తీయకుంటే బాగుండదని విరాట్ నాతో అన్నాడు. ఇది ప్రపంచకప్ అని గుర్తుచేశాడు. జట్టు కోసం కాకుండా.. వ్యక్తిగత మైలురాళ్ల కోసం కోహ్లీ ఆడుతున్నానని జనాలు భావిస్తారన్నాడు. మన విజయం ఖాయం అయింది, నువ్ సెంచరీ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదని కోహ్లీతో అన్నాను. ఎలాంటి ఆలోచనలు చేయకుండా సెంచరీ పూర్తి చేయమని చెప్పా. చివరకు సిక్స్ బాది శతకం చేశాడు’ అని తెలిపాడు.
విరాట్ కోహ్లీ 74 పరుగులతో ఉన్నప్పుడు భారత జట్టు విజయానికి 27 పరుగులు అవసరం. ఆ తర్వాత లోకేష్ రాహుల్ ఒక్క బంతి మాత్రమే ఆడాడు. కోహ్లీకే సెంచరీ చేసే అవకాశం ఇచ్చాడు. సింగిల్స్ కోసం కోహ్లీ ప్రయత్నించినా.. రాహుల్ పరుగు కోసం వెళ్లలేదు. 41 ఓవర్లు ముగిసే సరికి విరాట్ 97 పరుగులతో ఉన్నాడు. జట్టు విజయానికి ఇంకా రెండు పరుగులు మాత్రమే కావాలి. 42వ ఓవర్ తొలి బంతి లెగ్‌సైడ్ వెళ్లడంతో.. అంపైర్ వైడ్ ఇస్తాడా? అని కోహ్లీ చూశాడు. కానీ అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో కోహ్లీతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మూడో బంతికి సిక్సర్ బాది విరాట్ శతకం అందుకున్నాడు.