
Rohit Sharma and Virat Kohli interview Ahead of IND vs NZ Match: తప్పకుండా ఈసారి న్యూజిలాండ్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తామని.. వ్యక్తిగతంగానూ, జట్టు పరంగానూ ఏం చేయాలనే దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికొచ్చామని భారత సారథి రోహిత్ శర్మ తెలిపాడు. న్యూజిలాండ్ వ్యూహాలను అమలు చేయడంలో దిట్టని అభిప్రాయపడ్డాడు. నిలకడైన ఆటతీరును ప్రదర్శించడం వల్లే కివీస్ సక్సెస్ అవుతోందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో నేడు భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ప్రపంచకప్ చరిత్రలో ఇరు జట్లు 8 సార్లు తలపడగా.. ఐదు మ్యాచుల్లో కివీస్, మూడింటిలో భారత్ గెలిచింది.
భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడారు. ‘న్యూజిలాండ్ వ్యూహాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కివీస్ అత్యంత కట్టుదిట్టమైన వ్యూహాలను రచిస్తది. ప్రణాళికలకు అనుగుణంగా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తారు. కివీస్‌తో ఆడేటప్పుడు ప్రతి ఒక్కరిపై ప్రత్యేకంగా ప్రణాళికలను రచించుకుకోవాలి. కివీస్ ఐసీసీ టోర్నీల్లో మాపై పైచేయి సాధిస్తున్నారు. తప్పకుండా ఈసారి కివీస్‌ను కట్టడి చేస్తాం. వ్యక్తిగతంగానూ, జట్టు పరంగానూ ఏం చేయాలనేదానిపై ఓ నిర్ణయం తీసుకున్నాం’ అని రోహిత్ తెలిపాడు.
‘ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటంలో కివీస్ ఎప్పుడూ ముందుంటుంది. జట్టు ఇప్పుడు అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉంది. నిలకడైన ఆట తీరును ప్రదర్శించడంతోనే కివీస్ సక్సెస్ అవుతోంది. కివీస్ లయను దెబ్బ తీయడానికి తీవ్రంగా కష్టపడాలి. పూర్తిస్థాయి నైపుణ్యాలను ప్రదర్శిస్తేనే విజయం సాధించేందుకు అవకాశాలు ఉంటాయి. న్యూజిలాండ్‌పై ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదు. ఏ చిన్న అవకాశం దొరికినా.. ప్రత్యర్థిని వారు ముప్పుతిప్పలు పెడతారు. అదే కివీస్ విజయరహస్యం. అయితే జట్టు పరంగా మేం అన్ని విధాలుగా పటిష్ఠంగా ఉన్నాం. మంచి పోటీ ఉంటుంది. తప్పకుండా విజయం సాధిస్తామనే ధీమా ఉంది’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు.