
Mohammed Shami React on 5 Wicket-Haul performance: వన్డే ప్రపంచకప్ 2023లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ చెలరేగాడు. పటిష్ట న్యూజిలాండ్‌పై ఏకంగా ఐదు వికెట్స్ (5/54) పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్ ఒకానొక దశలో 300కి పైగా పరుగులు చేసేలా కనిపించినా.. షమీ సంచలన స్పెల్ కారణంగా 273 పరుగులకే పరిమితమైంది. అద్భుత ప్రదర్శన చేసిన షమీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అవార్డు తీసుకున్న అనంతరం షమీ మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశాడు.
‘తొలి బంతికే వికెట్ తీసిన తర్వాత నాలో మరింత నమ్మకం పెరిగింది. సహచరులు అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తున్నప్పుడు తప్పకుండా మనం అండగా నిలవాలి. జట్టుగా సమష్ఠిగా రాణిస్తే.. విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. నేను బంతి అందుకున్న సమయంలో వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. మన జట్టు ఎప్పుడూ టాప్‌లో ఉండాలని కోరుకోవాలి. ఐదు వికెట్లు తీయడంతో పాటు భారత్ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది’ అని మహమ్మద్ షమీ తెలిపాడు. తాను వేసిన తొలి బంతికే విల్ యంగ్‌ను షమీ బౌల్డ్ చేశాడు.
ప్రపంచకప్‌ప్‌ల్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన మహమ్మద్ షమీ.. 36 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌పై ఐదు వికెట్స్ పడగొట్టడంతో స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (31)ను షమీ అధిగమించాడు. ఇంకో 9 వికెట్లు తీస్తే షమీనే టాప్ భారత బౌలర్‌గా నిలుస్తాడు. షమీ కంటే ముందు మాజీలు జహీర్ ఖాన్ (44), జవగళ్ శ్రీనాథ్ (44) ఉన్నారు. ఇక వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచిన భారత్ పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇక న్యూజిలాండ్ నాలుగు విజయాలతో 8 పాయింట్లను ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో ఉంది.