
PAK vs AFG: వన్డే వరల్డ్ కప్లో మరో సంచలన విజయం నమోదైంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై అఫ్ఘాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిచింది. 283 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘన్ 49 ఓవర్లలో సునాయాసంగా చేధించింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది. అఫ్ఘాన్ బ్యాటింగ్ లో ఓపెనర్లు ఇబ్రహీం 87, గుర్బాజ్ 65 పరుగులతో అదరగొట్టారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన రెహమత్ 77 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. హష్మతుల్లా కూడా 48 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్ మెన్లను అడ్డుకట్ట వేసేందుకు పాక్ బౌలర్ల వల్ల కాలేదు. ఇప్పటికే వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పై ఓ సంచలన విజయం నమోదు చేసిన ఆఫ్ఘాన్.. పాకిస్తాన్ పై గెలిచి మరో విజయాన్ని అందుకుంది.
ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. పాకిస్తాన్ బ్యాటింగ్ లో షఫీక్ 58, కెప్టెన్ బాబర్ అజం 74, షాదాబ్ ఖాన్ 40, ఇఫ్తికర్ అహ్మద్ 40 పరుగులు చేశారు. ఇక ఆఫ్ఘాన్ బౌలింగ్ లో నవీన్ హుల్ హక్ 2, నూర్ అహ్మద్ 3 వికెట్లు తీశారు. నబీ, అజ్మతుల్లా తలో వికెట్ సాధించారు.
తర్వాత బ్యాటింగ్ దిగిన ఆఫ్ఘన్ 49 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్ని అందుకుంది. 283 పరుగుల ఛేజింగ్ లో ఆఫ్ఘన్ టాపార్డర్ అదరగొట్టింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్ తొలి వికెట్ కు 130 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత రహ్మత్ షా, కెప్టెన్ హష్మతుల్లా షాహిది మ్యాచ్ ను ముగించేశారు. రహ్మనుల్లా గుర్బాజ్ 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ తో 65 పరుగులు చేయగా, మరో ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ 113 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. రహ్మత్ షా 84 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు చేయగా, షాహిది 45 బంతుల్లో 48 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 1, హసన్ అలీ 1 వికెట్ తీశారు.