
Bangladesh Skipper Shakib Al Hasan Returns to Home: వన్డే ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ ఇప్పటివరకు పెద్దగా ఆకట్టుకోలేదు. మెగా టోర్నీలో పెద్ద జట్లకు షాక్‌లు ఇచ్చే బంగ్లా.. ఈసారి వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. ప్రారంభ గేమ్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించిన బంగ్లా.. ఆపై ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. కేవలం 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉండి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో గెలిచినా మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో జట్టుకు అండగా నిలవాల్సిన కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లిపోయాడు.
బంగ్లాదేశ్ తమ తదుపరి రెండు మ్యాచ్‌లను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆడాల్సి ఉంది. అక్టోబర్ 29న నెదర్లాండ్స్‌తో, అక్టోబర్ 31న పాకిస్థాన్‌తో బంగ్లా తలపడనుంది. తప్పక గెలవాల్సిన గేమ్‌ల ముందు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ శిక్షణ కోసం ఢాకాకు వెళ్లాడు. జట్టులోని మిగిలిన ప్లేయర్స్ కోల్‌కతా చేరుకోగా.. షకీబ్ మాత్రం బుధవారం మధ్యాహ్నం ఢాకా చేరుకున్నాడు. షకీబ్ తన మెంటార్ నజ్ముల్ అబెదీన్ ఫహీమ్‌తో కలిసి షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేశాడు. దాదాపు మూడు గంటల పాటు అతడి శిక్షణ కొనసాగింది. ప్రధానంగా త్రోడౌన్‌లను షకీబ్ చేశాడట.
షకీబ్ అల్ హసన్ శిక్షణ కోసం ఢాకాకు వచ్చినట్టు నజ్ముల్ అబెదీన్ ఫహీమ్ స్పష్టం చేసినట్టు ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో పేర్కొంది. ‘ఈరోజు (బుధవారం) షకీబ్ అల్ హసన్ ఢాకాకు వచ్చాడు. మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తాం. ఆపై అతను కోల్‌కతాకు తిరిగి వెళ్తాడు. మేము షకీబ్ బ్యాటింగ్‌పై దృష్టి సారించాం’ అని నజ్ముల్ చెప్పినట్లు ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో తమ కథనంలో పేర్కొంది. షకీబ్ ఈ ప్రపంచకప్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 56 పరుగులే చేశాడు. ఇక 5 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టాడు.