
How Can Pakistan Qualify For World Cup 2023 Semi Final: ఒక్క మ్యాచ్‌తో ఆస్ట్రేలియా తలరాతే మారిపోయింది. మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిన ఆసీస్.. వన్డే ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఆపై వరుసగా రెండు మ్యాచ్‌లలో గెలిచి నాలుగో స్థానానికి చేరుకున్నా.. మైనస్ నెట్ రన్ రేట్ కారణంగా సెమీస్ అవకాశాలు కష్టంగానే మారాయి. అయితే బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో నెదర్లాండ్స్‌ను ఏకంగా 309 పరుగుల తేడాతో ఓడించి.. భారీగా నెట్ రన్ రేట్ మెరుగు పరుచుకుని సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 6 పాయింట్స్ ఉండగా.. నెట్ రన్ రేట్ ప్లస్ 1.142గా ఉంది.
ఆస్ట్రేలియా భారీ విజయం ప్రపంచకప్ ఛాంపియన్‌లు ఇంగ్లండ్, పాకిస్థాన్‌తో సహా ఇతర జట్ల సెమీస్ అవకాశాలను ప్రమాదంలో పడేసింది. ముఖ్యంగా పాకిస్తాన్‌కు సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. ఇప్పటివరకు ఐదు గేమ్‌లు ఆడిన పాక్.. కేవలం రెండింటిలో మాత్రమే గెలిచిన పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. రన్ రేట్ (-0.400) మైనస్‌గా ఉండడం కూడా ఆ జట్టుకు పెద్ద ప్రతికూలంగా మారింది. అంతేకాదు పెద్ద జట్లతో తదుపరి మ్యాచ్‌లు పాకిస్తాన్ ఆడనుండడం మరో మైనస్‌గా మారింది. పాక్ తన తదుపరి మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మరియు ఇంగ్లండ్ లాంటి పటిష్ట జట్లను ఎదుర్కోవాల్సి ఉంది. బంగ్లాతో మ్యాచ్ కూడా పాక్ ఆడాల్సి ఉంది.
వన్డే ప్రపంచకప్ 2023లో ఓ జట్టు సెమీస్ చేరాలంటే కనీసం ఆరు మ్యాచ్‌లు గెలవాలి. పాక్ ఇప్పటివరకు 5 గేమ్స్ ఆడి 2 మాత్రమే గెలిచింది. దాంతో పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే.. మిగిలిన అన్ని మ్యాచ్‌లను గెలవాల్సి ఉంది. ఫామ్ మీదున్న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లపై విజయం అంత సులువు కాదు. ఇంగ్లండ్, బంగ్లాలు కూడా పటిష్ట జట్లే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సెమీస్ చేరడం కష్టంగానే కనిపిస్తోంది. పాక్ సెమీస్ చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. మరోవైపు ఇంగ్లండ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది.