Leading News Portal in Telugu

Rohit Sharma Injury: టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం!


Rohit Sharma Injury: టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం!

Rohit Sharma Set To Miss ODI World Cup 2023 IND vs ENG Match Today: సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. నేడు ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్ కోసం శనివారం లక్నోలో ప్రాక్టీస్ చేసిన హిట్‌మ్యాన్‌కు గాయమైనట్లు సమాచారం తెలుస్తోంది. గాయం కారణంగా ఈరోజు మధ్యాహ్నం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు రోహిత్ దూరంగా ఉంటాడని సమాచారం తెలుస్తోంది.

ఇంగ్లండ్‌ మ్యాచ్ కోసం శనివారం రోహిత్ శర్మ నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బౌలర్ విసిరిన బౌన్సర్ రోహిత్ కుడి చేతి మణికట్టుకు బలంగా తాకినట్లు తెలుస్తోంది. బంతి బలంగా తాకడంతో నొప్పితో విలవిలలాడిన హిట్‌మ్యాన్‌కు ఫిజియోలు చికిత్స చేశారు. ఆపై రోహిత్ ప్రాక్టీస్‌ను ఆపేసి మైదానాన్ని వీడాడట. రోహిత్ గాయానికి సంబంధించి బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే రోహిత్ గాయం చిన్నదే అయినా.. ముందుజాగ్రత్తలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం అవుతాడని తెలుస్తోంది.

ఒకవేళ రోహిత్ శర్మ దూరమైతే టీమిండియాకు కష్టాలు తప్పవు. ఇప్పటికే చీలమండ గాయంతో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమయ్యాడు. హార్దిక్ దూరమవడంతో జట్టు కూర్పుపై భారీగా ప్రభావం పడింది. రోహిత్ కూడా దూరమైతే భారత్ కష్టాలు రెట్టింపు అవుతాయి. ఒకవేళ రోహిత్ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరమయితే.. కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తాడు. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతాడు. ప్రపంచకప్‌ 2023లో రోహిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. హిట్‌మ్యాన్ ఐదు మ్యాచ్‌లలో ఒక సెంచరీతో సహా 311 పరుగులు చేశాడు.