
KL Rahul Remember bad memories in Lucknow ahead of IND vs ENG Match: లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంకు, టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా రాహుల్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలానే లక్నో స్టేడియంలో రాహుల్‌కు చేదు అనుభవం కూడా ఉంది. ఐపీఎల్ 2023 లీగ్ మధ్యలో ఇదే మైదానంలో గాయపడటంతో దాదాపు 5 నెలలు టీమిండియాకు దూరం అయ్యాడు. నేడు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాహుల్ ఆ అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. అయితే వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఫ్రెష్‌గా ఆడాలని చూస్తున్నాడట.
‘ఐపీఎల్ 2023 లీగ్ మధ్యలో ఇదే మైదానంలో గాయపడ్డా. ఐదు నెలల పాటు క్రికెట్‌కు, టీమిండియాకు దూరం కావాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ బాధ ఉంది. అది నాకు చాలా కఠినమైన సమయం. ఎవరైనా గాయపడి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత పునరాగమనం చేయాలంటే చాలా కష్టం. ఏ క్రికెటర్ అయినా ఇదే మాట చెబుతాడు. పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఓర్పుతో ఉండాలి, అయితే అదంత సులువేం కాదు. క్రికెట్‌లో ఎత్తుపల్లాలు సహజం. ఓ మ్యాచులో సెంచరీ చేస్తే.. మరో మ్యాచులో డకౌట్ అవొచ్చు. సక్సెస్ లేదా వైఫల్యాలను హ్యాండిల్ చేయాలి’ అని కేఎల్ రాహుల్ అన్నాడు.
‘గాయాలపాలైన తర్వాత ఫిజియో చేయించుకున్నా సరే నొప్పి మాత్రం వస్తూనే ఉంటుంది. దానిని అధిగమించాలంటే.. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. అదే నేను చేశా. ప్రపంచకప్ 2023లో మేం అద్భుత విజయాలతో కొనసాగుతున్నాం. లక్నో స్టేడియానికి వచ్చినప్పుడు పాత జ్ఞాపకాలు మదిలో మెదిలాయి. నేను వాటిని మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నా. కానీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. అన్ని పక్కన పెట్టేసి ఫ్రెష్‌గా బరిలోకి దిగుతున్నా. భారీ ఇన్నింగ్స్‌తో గత చేదు అనుభవాలను మరిచిపోతా’ అని కేఎల్ రాహుల్ చెప్పాడు.