Leading News Portal in Telugu

Rohit Sharma: మేం 30 పరుగులు తక్కువ చేశాం.. మా బౌలర్లు సూపర్!


Rohit Sharma: మేం 30 పరుగులు తక్కువ చేశాం.. మా బౌలర్లు సూపర్!

India Captain Rohit Sharma React on Victory vs England: వన్డే ప్రపంచకప్‌ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో టీమిండియా విజయం సాధించింది. లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత పోరాటంతో గెలిచి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా దాదాపుగా సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌లో కీలక సమయాల్లో వికెట్లను చేర్చుకుని తక్కువ స్కోరుకే పరిమితమైనా.. అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని 129 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ విజయంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బ్యాటింగ్‌లో తాము 30 పరుగులు తక్కువ చేసినా.. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో గట్టెక్కామని చెప్పాడు.

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘జట్టులోని ప్రతి ఆటగాడికి ఈ మ్యాచ్ పరీక్ష పెట్టింది. క్లిష్ట పరిస్థితుల్లో అనుభవ ప్లేయర్లు అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించారు. మెగా టోర్నీలో ఇప్పటివరకు మేం ఆడిన తీరు వేరు, ఈ మ్యాచ్‌లో చేసిన పోరాటం వేరు. గత ఐదు మ్యాచ్‌లలో మేం లక్ష్య ఛేదనకు దిగాం. ఈసారి మాత్రం ముందుగా బ్యాటింగ్‌ చేశాం. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఇంగ్లీష్ బౌలర్ల అద్భుత బౌలింగ్‌ను ఎదుర్కొని స్కోరు బోర్డుపై మంచి లక్ష్యం ఉంచాం. అయితే బ్యాటింగ్‌లో ఆశించిన మేర రాణించలేదు. నాతో పాటు మరికొందరు అనవసరంగా వికెట్లను సమర్పించారు. 30 పరుగులు తక్కువ చేసాం’ అని అన్నాడు.

‘భారత బౌలింగ్‌ సూపర్. బౌలర్లు అద్భుతం చేశారు. ఆరంభంలో 2-3 వికెట్లు తీస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరుగుతుంది. ఇదే మా బౌలర్లు చేశారు. కీలక సమయాల్లో వికెట్లు తీసిఇంగ్లండ్‌ను కుదురుకోనీయలేదు. పిచ్‌ పరిస్థితులను కూడా కలిసొచ్చాయి. స్వింగ్‌తో పాటు పిచ్‌ నుంచి కూడా సహకారం లభించడంతో ఇంగ్లీష్ ఆటగాళ్లకు బ్యాటింగ్‌ కష్టంగా మారిపోయింది. మా బౌలర్ల అనుభవం మాకు కలిసొచ్చింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ.. కొన్ని కీలక అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఈ విజయం బౌలర్లదే. వారి ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే’ అని రోహిత్ శర్మ చెప్పాడు.