Leading News Portal in Telugu

Virat Kohli-Rohit Sharma: విరాట్ కోహ్లీ చేసిన పనికి ఫాన్స్ ఫుల్ ఖుషీ.. వీడియో వైరల్!


Virat Kohli-Rohit Sharma: విరాట్ కోహ్లీ చేసిన పనికి ఫాన్స్ ఫుల్ ఖుషీ.. వీడియో వైరల్!

Virat Kohli Hugs Rohit Sharma During IND vs ENG Match: సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న టీమిండియా.. మెగా టోర్నీలో డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన ఏకంగా 100 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో విజయం సాధించిన భారత్.. పాయింట్ల పట్టికలో మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకుంది. అంతేకాదు సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది.

అయితే ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత సారథి రోహిత్ శర్మలు చేసుకున్న సంబరాలు హైలెట్‌గా నిలిచాయి. 230 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్స్ కోల్పోయింది. వికెట్లు పడినప్పుడల్లా కోహ్లీ, రోహిత్ కలిసి సంబరాలు చేసుకున్నారు. ఓసారి వికెట్ పడగానే విరాట్ సంతోషంలో మునిగిపోయాడు. ఆ సంతోషంలో రోహిత్‌ను ఎత్తుకున్నాడు. ఆ సమయంలో రోహిత్ తన సహచరుడిని గట్టిగా హత్తుకున్నాడు. ఆపై ఇద్దరు కలిసి మ్యాచ్ గురించి మాట్లాడుకున్నారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సంబరాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరినీ ఇలా సంతోషంలో చూసిన ఫాన్స్ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ‘ఇద్దరినీ ఇలా చూస్తుంటే మ్యాచ్ గెలిచినంత తృప్తిగా ఉంది’, ‘ఎప్పటికి ఇలానే ఉండండి’, ‘బెస్ట్ ఫ్రెండ్స్’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2019 ప్రపంచకప్ అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని సోషల్ మీడియా కోడై కూసిన విషయం తెలిసిందే. దాంతో కాస్త నిరాశ చెందిన ఫాన్స్.. ఇప్పుడు ఆనందంలో తేలిపోతున్నారు.