Leading News Portal in Telugu

Virat Kohli Birthday: బర్త్‌ డే రోజు ‘కింగ్’ కోహ్లీ సెంచరీ చేస్తాడు.. పాకిస్తాన్ క్రికెటర్ జోస్యం!


Virat Kohli Birthday: బర్త్‌ డే రోజు ‘కింగ్’ కోహ్లీ సెంచరీ చేస్తాడు.. పాకిస్తాన్ క్రికెటర్ జోస్యం!

Mohammad Rizwan Says birthday wishesh to Virat Kohli: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో రోహిత్ సేన వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో విజయాలలు సాధించిన భారత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. దాదాపుగా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న టీమిండియా.. లీగ్ దశలో ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నవంబర్‌ 5న దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. నవంబర్‌ 5న భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ 35వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే కోహ్లీకి బర్త్‌ డే విషెష్ చెప్పిన పాకిస్థాన్‌ వికెట్‌కీపర్ మహ్మద్‌ రిజ్వాన్‌.. దక్షిణాఫ్రికాపై సెంచరీ చేయాలని కోరుకున్నాడు.

ప్రస్తుతం ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు మహ్మద్‌ రిజ్వాన్‌ మీడియాతో మాట్లాడుతూ విరాట్ కోహ్లీకి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘నవంబర్ 5న విరాట్ కోహ్లీ పుట్టినరోజు అని తెలుసుకోవడం ఆనందంగా ఉంది. నేను బర్త్‌ డేలను సెలబ్రేట్‌ చేసుకోను. అయితే కోహ్లీకి ముందే పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుతున్నా. ఈ బర్త్‌ డే అతడికి ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోవాలని కోరుకుంటున్నా. పుట్టినరోజున కోహ్లీ 49వ వన్డే సెంచరీ చేస్తాడని నేను అనుకుంటున్నా. ప్రపంచకప్‌ 2023లోనే కోహ్లీ 50వ సెంచరీ కూడా చేయాలనీ కోరుకుంటున్నా’ అని మహ్మద్‌ రిజ్వాన్‌ తెలిపాడు.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ వన్డేల్లో 48 సెంచరీలు చేశాడు. మరో సెంచరీ చేస్తే వన్డేల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (49) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. ఇక ఇంకో సెంచరీ చేస్తే.. శతకాల హాఫ్ సెంచరీని అందుకుంటాడు. కోహ్లీ ఫామ్‌ని చూస్తుంటే.. ఈ ప్రపంచకప్‌లోనే ఆ రికార్డు బ్రేక్ చేసే అవకాశముంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో విరాట్ 354 రన్స్ చేశాడు. ప్రస్తుతం కోహ్లీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి టీమిండియాకు ప్రపంచకప్‌ అందిస్తాడని ఫాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.