Leading News Portal in Telugu

Afghanistan Cricket: అఫ్గానిస్తాన్ నెక్స్ట్‌ టార్గెట్‌ ఆస్ట్రేలియా.. ఓడిస్తే సెమీస్‌కు..!


Afghanistan Cricket: అఫ్గానిస్తాన్ నెక్స్ట్‌ టార్గెట్‌ ఆస్ట్రేలియా.. ఓడిస్తే సెమీస్‌కు..!

2023 World Cup Semi Finals Qualification Scenarios for Afghanistan: ప్రపంచకప్‌లలో సంచనాలకు మారుపేరు ‘బంగ్లాదేశ్’ టీమ్ అన్న విషయం తెలిసిందే. బంగ్లా పెద్ద పెద్ద జట్లకు షాక్‌లు ఇచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్ సరసన అఫ్గానిస్తాన్ కూడా చేరింది. ప్రపంచకప్‌ 2023లో అఫ్గాన్‌ సంచలన విజయాలు సాధిస్తోంది. ప్రస్తుత ఏడిషన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌, మాజీ వరల్డ్‌కప్‌ విన్నర్‌ పాకిస్తాన్‌ జట్లను మట్టికరిపించిన అఫ్గానిస్తాన్.. తాజాగా మాజీ వరల్డ్‌ ఛాంపియన్‌ శ్రీలంకకు షాకిచ్చింది. పూణే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను అఫ్గాన్‌ ఓడించింది.

సంచలన విజయాలు సాధిస్తూ ప్రపంచకప్‌ 2023లో దూసుకుపోతున్న అఫ్గానిస్తాన్‌కు ఇప్పుడు సెమీస్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే మూడు సంచలన విజయాలు నమోదు చేసిన అఫ్గాన్‌.. మరో 1-2 సాధిస్తే సెమీస్ చేరుతుంది. నవంబర్‌ 3న నెదర్లాండ్స్‌తో అఫ్గాన్‌ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఆటగాళ్ల ఫామ్‌, వారిలో ఉన్న కసి చూస్తే డచ్ టీంను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తుంది. నెదర్లాండ్స్‌ను ఓడిస్తే.. అఫ్గాన్‌ ఖాతాలో 8 పాయింట్స్ చేరుతాయి. ప్రస్తుతం 6 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచి సెమీస్‌పై ఆశ పెట్టుకుంది.

నవంబర్‌ 7న ఐదుసార్లు జగజ్జేత, పటిష్ట ఆస్ట్రేలియాతో అఫ్గానిస్తాన్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఎందుకంటే ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంకలకు షాక్ ఇచ్చినట్లు ఆస్ట్రేలియాను కంగుతినిపిస్తుందేమో అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఆస్ట్రేలియాకు షాకిస్తే ప్రపంచకప్‌ చరిత్రలోనే పెను సంచలనం నమోదవుతుంది. అంతేకాదు సెమీస్ రేసు రసవత్తరంగా మారుతుంది. ప్రస్తుతం అఫ్గాన్‌ ఆటగాళ్ల ఫామ్‌ చూస్తే.. షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి నవంబర్‌ 7న ఏం జరుగుతుందో చూడాలి.

ఇక నవంబర్‌ 10న పటిష్టమైన దక్షిణాఫ్రికాతో అఫ్గానిస్తాన్‌ మ్యాచ్ ఆడాల్సి ఉంది. వరుస విజయాలు సాధిస్తున్న దక్షిణాఫ్రికాపై అఫ్గాన్‌ విజయం సాధించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికాలలో ఒక్క జట్టుపై అయినా అఫ్గాన్‌ గెలిస్తే మరో పెను సంచలనం నమోదవుతుంది. దక్షిణాఫ్రికా కంటే ఆస్ట్రేలియాను ఓడిస్తేనే అఫ్గానిస్తాన్‌కు సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే అఫ్గానిస్తాన్ నెక్స్ట్‌ టార్గెట్‌ ఆస్ట్రేలియా అయింది. చూడాలి మరి అఫ్గాన్‌ సంచనాలు నమోదు చేసి సెమీస్ చేరుతుందా? లేదా ఓటములతో ఇంటికి వెళుతుందో?.