Leading News Portal in Telugu

Babar Azam Chat: బాబర్ అజామ్‌ ప్రైవేట్ చాట్‌ లీక్!


Babar Azam Chat: బాబర్ అజామ్‌ ప్రైవేట్ చాట్‌ లీక్!

Babar Azam Private Whatsapp Chat Leaked: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌.. పేలవమైన ప్రదర్శన చేస్తోంది. మెగా టోర్నీలో పాక్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి.. రెండింటిలోనే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న పాక్.. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బాబర్ అజామ్‌ కెప్టెన్‌గా, ఆటగాడిగా విఫలం అవుతుతుండడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వరుసగా విఫలమవుతున్న బాబర్‌పై పెద్ద ఎత్తున్న విమర్శలు వస్తున్నాయి. ప్రపంచకప్ 2023 ముగిసిన అనంతరం అతడి కెప్టెన్సీపై వేటు పడుతుందని ప్రచారం జరుగుతోంది. ఇది చాలదన్నట్లు పీసీబీకి మరో తలనొప్పి వచ్చి పడింది.

పాకిస్తాన్ జట్టుకు బోర్డు నుంచి సరైన సహకారం లేదని, గత 5 నెలలుగా జీతాలు ఇవ్వలేదని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ విషయం గురించి పాక్ కెప్టెన్ బాబర్‌ అజామ్‌.. పీసీబీ చీఫ్ జకా అష్రఫ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించినా, మెసేజ్‌ చేసినా అతడు రియాక్ట్ అవ్వలేదని మాజీ కెప్టెన్ లతీఫ్ రషీద్ పేర్కొన్నాడు. అంతేకాదు బాబర్‌, పీసీబీ చీఫ్‌ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నసీర్ మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్‌ లీక్‌ అయింది. ఈ విషయాన్ని పీసీబీ చీఫ్ జకా అష్రఫ్‌ ఓ టీవీ ఛానల్లో ప్రస్తావించారు. అతడే ఈ చాట్‌ని లీక్‌ చేశాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే లీకైన చాటింగ్‌లో ఎంత మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. బాబర్‌ అజామ్, సల్మాన్‌ నసీర్ వాట్సాప్‌ చాటింగ్ ఇలా ఉంది. ‘బాబర్ అజామ్.. నువ్వు ఫోన్‌ చేస్తే ఛైర్మన్ స్పందించడం లేదని టీవీల్లో, సోషల్ మీడియాలో న్యూస్ వస్తోంది. నువ్వు ఈ మధ్య ఏమైనా ఛైర్మన్‌కు ఫోన్ చేశావా?’ అని నసీర్ అడగ్గా.. ‘నమస్తే సల్మాన్ భాయ్‌.. నేను జకా అష్రఫ్‌కు కాల్‌ చేయలేదు’ అని బాబర్‌ రిప్లై ఇచ్చాడు. బాబర్‌ ప్రైవేట్ చాట్‌ను లీక్‌ చేయడంపై పాక్‌ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.