Leading News Portal in Telugu

IND vs SA: కోల్‌కతాలో బ్లాక్ టికెట్ దందా.. రూ. 2500 టికెట్ ఏకంగా 11 వేలు!


IND vs SA: కోల్‌కతాలో బ్లాక్ టికెట్ దందా.. రూ. 2500 టికెట్ ఏకంగా 11 వేలు!

Kolkata Police Arrested A Man for selling IND vs SA Black Tickets: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా.. సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. లీగ్ దశలో భారత్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో నవంబర్ 5న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో పటిష్ట దక్షిణాఫ్రికాను ఢీ కొట్టనుంది. మెగా టోర్నీలో భారత్, దక్షిణాఫ్రికా జట్లు వరుస విజయాలతో దూసుకెళ్తుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా నవంబర్ 5న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బర్త్ డే కావడంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండడంతో ఈ మ్యాచ్‌కు భారీ హైప్ ఏర్పడింది.

భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ చూడాలని అభిమానులు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబందించిన టికెట్స్ ఆన్‌లైన్‌లో ఇప్పటికే అమ్ముడయ్యాయి. దాంతో బ్లాక్ దందా తెరపైకి వచ్చింది. అభిమానుల క్రేజ్‌ను సొమ్ము చేసుకోవాలని బ్లాక్ బకాసురులు చూస్తున్నారు. మంగళవారం ఓ వ్యక్తి రూ. 2500 టికెట్‌ను ఏకంగా రూ. 11000 ధరకు అమ్ముతుండగా కోల్‌కతా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న 20 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారనే సమాచారంతో అతడి ఇంటిపై కూడా పోలీసులు రైడ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు అంకిత్ అగర్వాల్ అని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అయింది. విషయం తెలిసిన ఫాన్స్ షాక్ అవుతున్నారు. ఒక్కో టికెట్‌ను ఇంత ఎక్కువకు అమ్ముకోవడం ఏంటి? అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో ఉన్న భారత్ నవంబర్ 2న శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి అధికారికంగా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. భారత్ ఫామ్ చూస్తే లంకపై విజయం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.