Pakistan Semi Finals Chances: పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే.. ఓ అద్భుతమే జరగాలి!ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటే?

Here is The Scenarios for Pakistan to Qualify For World Cup 2023 Semifinal: వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత ఓ విజయం సాధించింది. మంగళవారం కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాక్ 6 పాయింట్లతో పట్టికలో ఐదవ స్థానానికి చేరింది. టేబుల్లో అఫ్గాన్‌ను వెనక్కి నెట్టి.. ఓ స్థానంను మెరుగుపరుచుకుని సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. లీగ్ దశలో పాకిస్థాన్‌కు ఇంకా 2 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. న్యూజిలాండ్, ఇంగ్లండ్ లాంటి పటిష్ట జట్లతో పాక్ తలపడాల్సి ఉంది.
మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్ గెలిస్తే.. ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు చేరుతాయి. ఈ 10 పాయింట్లతో పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే చాలా కష్టం. అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై పాక్ ఆధారపడాల్సి ఉంటుంది. ఎనిమిదేసి పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడు, నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తమ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. మరోవైపు ఆరో స్థానంలో ఉన్న అఫ్గానిస్థాన్ ఒకటి కంటే ఎక్కువ మ్యాచులు గెలవకూడదు. అప్పుడు ఈ మూడు జట్లు 8 పాయింట్లతో ఉంటే.. పాక్ 10 పాయింట్లతో సెమీస్ చేరుతుంది.
ఒకవేళ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఒక్కో మ్యాచ్ గెలిచి 10 పాయింట్లు సాధిస్తే.. పాకిస్థాన్‌తో సమంగా ఉంటాయి. అప్పుడు రన్‌రేట్ కీలకం అవుతుంది. మెరుగైన రన్ రేట్ ఉన్న టీమ్స్ సెమీస్ చేరుకుంటాయి. పాకిస్థాన్ చివరి రెండు మ్యాచ్‌లను మెరుగైన రన్‌రేట్‌తో గెలిస్తేనే అవకాశం ఉంటుంది. ఇది జరగడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. అద్భుతం జరిగితే తప్పా.. పాక్ సెమీస్ చేరలేదు. ఒకవేళ చివరి రెండు మ్యాచులలో పాక్ ఒకటి ఓడినా సెమీస్ ఆశలు గల్లంతవుతాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఫామ్ దృష్టా పాక్ సెమీస్ చేరడం ఆసాద్యమే.