
BCCI Bans Fire Crackers In Delhi, Mumbai Matches in World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో లైటింగ్ షో, మ్యాచ్ అయ్యాక స్టేడియంలో టపాసులను పేలుస్తూ సంబరాలు నిర్వహిస్తోంది బీసీసీఐ. లైటింగ్ షో వల్ల పెద్దగా నష్టం లేదు కానీ.. టపాసులను కాల్చడం వల్ల గాలి కాలుష్యం అవుతోంది. అత్యంత దారుణ గాలి కాలుష్యం ఉండే ఢిల్లీ, ముంబై నగరాల్లో టపాసులను పేల్చడం వల్ల మరింత వాతావరణానికి హాని చేసినట్లే అవుతుందని పర్యావరణ అధికారులు, అభిమానుల నుంచి బీసీసీఐకి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో చివరి నిమిషంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ, ముంబై మైదానాల్లో జరిగే మ్యాచ్‌ల సందర్భంగా టపాసులను కాల్చడంపై బ్యాన్ విధిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ కీలక ప్రకటన చేశారు. ‘వాతావరణంను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, ముంబై మైదానాలో టపాసుల ప్రదర్శన నిర్వహించడం లేదు. వాతావరణ సమస్యలపై బీసీసీఐ కూడా తన వంతు కృషి చేస్తుంది. ఇదే విషయాన్ని ఐసీసీకి వివరించాం. వన్డే ప్రపంచకప్‌ను అద్భుతంగా నిర్వర్తించడం వల్ల భవిష్యత్తులో క్రికెట్‌కు అదనపు ప్రయోజనం చేకూరనుంది. అదే సమయంలో అభిమానులు, ఆటగాళ్లు, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. అందుకే ఫైర్ వర్క్స్‌ను నిలిపివేస్తున్నాం’ అని జై షా తెలిపారు.
బీసీసీఐ తాజా నిర్ణయంతో భారత్, శ్రీలంక మ్యాచ్ ముగిసిన తరువాత ముంబై మైదానంలో ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండవు. షెడ్యూల్ ప్రకారం.. ఢిల్లీ వేదికగా నవంబర్ 6న చివరి మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచులో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఇక ముంబై వేదికగా మూడు మ్యాచ్‌లు ఉన్నాయి. భారత్, శ్రీలంక మ్యాచ్‌తో పాటు ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ మ్యాచ్ కూడా ఉంది. తొలి సెమీస్‌కు వేదిక కూడా వాంఖడే మైదానమే ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచులకు క్రాకర్స్ సందడి ఉండదు.