
Rohit Sharma Calls Wankhede Stadium Very Special Venue ahead of IND vs SL Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్, శ్రీలంక మ్యాచ్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెటర్‌గా నిలదొక్కుకోవడానికి వాంఖడే స్టేడియం ప్రధాన కారణమని తెలిపాడు. ఈ మైదానంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నానని, ఈ మైదానం తనకు ఎంతో ప్రత్యేకమైనదని హిట్‌మ్యాన్ చెప్పాడు.
‘ముంబైలోని వాంఖడే స్టేడియం నాకెంతో ప్రత్యేకమైంది. మంచి క్రికెటర్‌గా మీ ముందు ఉండటానికి కారణం ఇదే మైదానం. ప్రతి విషయం ఇక్కడ నుంచే నేర్చుకున్నా. అందుకే ఈ మైదానం మరే ఇతర స్టేడియానికి సాటిరాదు. వాంఖడే స్టేడియంలో ముంబై ప్రజల అభిమానాన్ని కొలవడం అసాధ్యం. చాలా ఏళ్లుగా నాకు మద్దతుగా నిలుస్తున్నారు. స్టేడియంలోని ప్రతి స్టాండ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఉత్తరం స్టాండ్ ఎంతో ప్రసిద్ధి. అభిమానులు అటు వైపు నుంచే ఎక్కువగా వస్తారు’ అని రోహిత్ శర్మ తెలిపాడు.
తన ప్రాంతమైన ముంబైపై రోహిత్ శర్మకు ఎంతో అభిమానం ఉంటుంది. అందుకే చాలా ఏళ్లుగా ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్నాడు. ముంబై జట్టుకి ఏకంగా ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన విషయం తెలిసిందే. వాంఖడే స్టేడియంలో రోహిత్ చెలరేగి ఆడుతాడు. శ్రీలంకపై కూడా హిట్‌మ్యాన్ చెలరేగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరుకానున్నారు. స్టేడియం మొత్తం రోహిత్ నామస్మరణతో మార్మోగిపోవడం పక్కా. ఈ మ్యాచ్‌కు రోహిత్ సతీమణి రితికా, కుమార్తె సమైరా హాజరుకానున్నారు.