Leading News Portal in Telugu

Ballon d’Or 2023: లియోనల్‌ మెస్సీకి మరోసారి ‘బాలన్‌ డి ఓర్‌’ అవార్డు.. ఏకంగా ఎనిమిదోసారి!


Ballon d’Or 2023: లియోనల్‌ మెస్సీకి మరోసారి ‘బాలన్‌ డి ఓర్‌’ అవార్డు.. ఏకంగా ఎనిమిదోసారి!

Another Ballon d’Or trophy to Lionel Messi tally: ఫుట్‌బాల్‌ స్టార్ అటగాడు, అర్జెంటీనా ప్లేయర్‌ లియోనల్‌ మెస్సీని మరోసారి ‘బాలన్‌ డి ఓర్‌’ అవార్డు వరించింది. 2022-23గాను ఉత్తమ ప్రదర్శన చేసినందుకు మెస్సీకి ఈ అవార్డు దక్కింది. గతేడాది నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో పాటు ఖతర్‌ వేదికగా జరిగిన ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో తన జట్టును గెలిపించినందుకు ఈ అవార్డు దక్కింది. సోమవారం పారిస్‌లోని థియేటర్ డు చాట్‌లెట్‌లో బాలన్‌ డి ఓర్‌ అవార్డును మెస్సీ అందుకున్నాడు.

అత్యధిక సార్లు బాలన్‌ డి ఓర్‌ అవార్డు అందుకున్న ఆటగాడిగా లియోనల్‌ మెస్సీ రికార్డు సృష్టించాడు. మెస్సీ 8వ సారి ఈ అవార్డు అందుకున్నాడు. 36 ఏళ్ల మెస్సీ ఎనిమిదవ బాలన్ డి’ఓర్ అవార్డును కైవసం చేసుకోవడంతో వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని అతడు మరోసారి నిరూపించాడు. ఇంటర్ మయామి స్టార్ పురుషుల 30 మంది అభ్యర్థుల జాబితాలో ఎర్లింగ్ హాలాండ్‌ను ఓడించి మెస్సీ అగ్రస్థానంలో నిలిచాడు.

ఇంటర్ మియామీ సహ యజమాని డేవిడ్ బెక్‌హామ్ చేతుల మీదుగా లియోనల్‌ మెస్సీ ‘బాలన్‌ డి ఓర్‌’ అవార్డు అందుకున్నాడు. మెస్సీ థియేటర్ డు చాట్‌లెట్‌ వేదికపై మాట్లాడుతూ.. ఈ అవార్డు అర్జెంటీనా జట్టు మొత్తానికి ఓ బహుమతి అని పేర్కొన్నాడు. ఇక దివంగత అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు డిగో మారడోనాకు ఈ ట్రోఫీని అంకితమిస్తున్నట్లు మెస్సీ తెలిపాడు.

అత్యధిక బాలన్‌ డి ఓర్‌ అవార్డు ఆదుకున్న జాబితాలో ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (5) రెండో స్థానంలో ఉన్నాడు. మహిళల విభాగంలో స్పెయిన్‌, మార్సిలోనా జట్టు మిడ్‌ఫీల్డర్‌ ఐతన బొన్‌మాటి బాలన్‌ డి ఓర్‌ అవార్డును అందుకుంది. తొలిసారిగా ఆమె ఈ అవార్డు దక్కించుకుంది. 2023 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన స్పెయిన్‌ జట్టులో ఐతన సభ్యురాలు.