
IND vs SL Preview and Playing 11: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో ఆడిన ఆరు వన్డేల్లో ఒక్క ఓటమీ లేకుండా.. సెమీస్‌కు అత్యంత చేరువగా వచ్చిన జట్టు భారత్. మరో విజయంతో నాకౌట్ బెర్తును అధికారికంగా సొంతం చేసుకోవడంపై టీమిండియా దృష్టిపెట్టింది. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ లాంటి మేటి జట్లపై విజయాలు సాధించిన భారత్.. బలహీన శ్రీలంకను ఓడించడం పెద్ద కష్టమేమి కాదు. ఇక ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడి సెమీస్ రేసులో వెనుకబడిన లంక.. వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియాపై విజయం సాధించడం కష్టమే. రోహిత్ సేనకు ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.
భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ప్రధాన ఆటగాళ్లందరూ ఫామ్ కనబర్చుతున్నారు. హార్దిక్ పాండ్యా దూరం కావడంతో.. తుది జట్టులో అవకాశం దక్కించుకున్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా సత్తా చాటారు. అయితే శ్రేయస్ అయ్యర్ ఫామ్ మాత్రం టీమిండియాను ఆందోళన కలిగిస్తోంది. మెగా టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌లలో శ్రేయస్ 134 పరుగులే చేశాడు. గత మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉండగా.. అనవసర షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. దాంతో లంకపై ఫామ్ అందుకోకపోతే.. టీమ్ మేనేజ్మెంట్ ప్రత్యామ్నాయాల వైపు చూడడం ఖాయం. శుభ్‌మన్ గిల్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. రోహిత్, కోహ్లీ, రాహుల్, జడేజా, కుల్దీప్, బుమ్రాలు నిలకడను కొనసాగిస్తున్నారు.
ఆరు మ్యాచ్‌లు ఆడి రెండే గెలిచిన శ్రీలంక ఈ మ్యాచ్‌లో ఓడితే సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. కెప్టెన్ శనకతో పాటు పతిరన, కుమార గాయాలతో దూరం కావడం జట్టును దెబ్బ తీసింది. ఆరంభంలో అదరగొట్టిన కుశాల్ మెండిస్.. జట్టు పగ్గాలు అందుకున్నాక రాణించలేకపోతున్నాడు. నిశాంక ఒక్కడే పరుగులు చేస్తున్నాడు. ధనంజయ డిసిల్వా తేలిపోతున్నాడు. బౌలింగ్‌లో తీక్షణ నిరాశ పరుస్తున్నాడు. పేసర్ మదుశంక, సీనియర్ మాథ్యూస్ మీద జట్టు ఆశలు పెట్టుకుంది.
Also Read: Liquor Bottles: ప్రమాదానికి గురైన కారు.. మద్యం బాటిళ్లతో జనాలు జంప్! వీడియో వైరల్
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్దీప్, షమీ, బుమ్రా, సిరాజ్/ అశ్విన్.
శ్రీలంక: నిశాంక, కరుణరత్నె, మెండిస్ (కెప్టెన్), సమరవిక్రమ, అసలంక, మాథ్యూస్, డిసిల్వా, తీక్షణ, చమీర, మదుశంక, రజిత.