
Hardik Pandya to play ODI World Cup 2023 semifinal: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకువెళ్తున్న భారత్‌కు బ్యాడ్ న్యూస్. గాయంతో జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రావడానికి మరికొన్ని రోజుల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. నవంబర్ 12న నెదర్లాండ్స్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో ప్రపంచకప్ 2023 లీగ్ దశలో పాండ్యా ఆడడు అని స్పష్టం అయింది.
‘హార్దిక్ పాండ్యాకు అయిన గాయం చిన్నదే. ఎలాంటి ఆందోళన వద్దు. హార్దిక్ వేగంగా కోలుకుంటున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023 చివరి లీగ్ మ్యాచ్‌కు తిరిగొచ్చే అవకాశముంది. నేరుగా సెమీఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశమూ లేకపోలేదు’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. హార్దిక్ ఇప్పటికే న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. భారత్ ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న నేపథ్యంలో గాయం తగ్గినా.. నెదర్లాండ్స్‌పై ఆడే అవకాశాలు తక్కువే.
శ్రీలంక మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా హార్దిక్ పాండ్యా గాయంపై స్పందించాడు. ‘టీమిండియాకు సానుకూల పరిణామం. హార్దిక్ పాండ్యా వేగంగా కోలుకుంటున్నాడు. నేను దీనిని పునరావాసం అని చెప్పలేను. హార్దిక్ విషయంలో ఎన్సీఏ సానుకూల ఫలితాలను కలిగి ఉంది. తదుపరి మ్యాచ్‌కి హార్దిక్ అందుబాటులో ఉండదు. అతడి గాయంను ప్రతిరోజూ పర్యవేక్షించవలసి ఉంటుంది. రికవరీ శాతం ఎంత, బ్యాటింగ్, బౌలింగ్ భారాన్ని పర్యవేక్షించాలి’ అని రోహిత్ చెప్పాడు. హార్దిక్ స్ధానంలో సూర్యకుమార్ యాదవ్‌ను కొనసాగించే ఛాన్స్ ఉంది.