
Sri Lanka have won the toss and have opted to field vs India: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబైలోని వాంఖడే మైదానంలో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ కుషాల్ మెండిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. మరోవైపు భారత్ మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దాంతో వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌కు నిరాశే ఎదురైంది. వాంఖడే మైదానం స్పిన్‌కు అనుకూలం అన్న నేపథ్యంలో మొహ్మద్ సిరాజ్ స్థానంలో యాష్ ఆడుతాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ప్రపంచకప్‌లో భారత్ డబుల్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లపై వరుసగా విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి అధికారికంగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తుంది. మరోవైపు శ్రీలంక ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘన్ చేతిలో ఓడిన లంక ఎలాగైనా భారత్‌ను ఓడించి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.
ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించినప్పటికీ లంకకు ఒరిగేదేమీ ఉండదు. ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో నిష్క్రమణకు దగ్గరగా ఉంది. ప్రపంచకప్‌లో ఇరు జట్లు 9 సార్లు తలపడగా.. భారత్ 4, శ్రీలంక 4 విజయాలతో సమంగా ఉన్నాయి. ఓ మ్యాచ్‌లో మాత్రం ఫలితం రాలేదు. వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. తొలుత బ్యాటింగ్ చేసే జట్లు 350కు పైగా పరుగులు చేసే అవకాశం ఉంది. బౌండరీలు చిన్నగా ఉంటాయి కాబట్టి సిక్సుల మోత మోగే అవకాశం ఉంటుంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (వాప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దుషన్ హేమంత, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక.