Leading News Portal in Telugu

World Cup 2023: ఇన్‌హేలర్లు వాడుతున్న క్రికెట్ ప్లేయర్స్.. కారణం ఏంటంటే?


World Cup 2023: ఇన్‌హేలర్లు వాడుతున్న క్రికెట్ ప్లేయర్స్.. కారణం ఏంటంటే?

Ben Stokes and Joe Root using Inhalers Due To Air Pollution in CWC 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 కోసం భారత్‌లో ఉన్న కొందరు క్రికెట్ ప్లేయర్స్ ఇన్‌హేలర్లు వాడుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ జట్టులోని ప్లేయర్స్ ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లోని తీవ్రమైన వాయు కాలుష్యాన్ని తట్టుకోవడం కోసం ఇన్‌హేలర్లను ఉపయోగిస్తున్నారు. ప్రపంచకప్‌ 2023 మ్యాచ్‌ల కోసం దేశంలోని ప్రధాన నగరాల్లో పర్యటిస్తున్న ఇంగ్లీష్ జట్టుకు వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారింది. బెంగళూరులో శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌లో పాల్గొన్న ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్‌.. ఇన్‌హేలర్‌ వాడుతూ కనిపించాడు. అయితే ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉన్న ఆ జట్టు ఆటగాళ్లకు ఇన్‌హేలర్లు అవసరం లేదట.

ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఢిల్లీలో వాయు కాలుష్యం 460 ఏక్యూఐగా నమోదైంది. దాంతో చిన్న పిల్లలు, పెద్దవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయు కాలుష్యం కారణంగా రెండు రోజుల పాటు స్కూల్స్ బంద్ చేశారు. ముంబైలో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. నావీ ముంబైలో ఏక్యూఐ 226గా ఉంది. ఢిల్లీతో పోల్చితే.. ముంబైలో వాయు కాలుష్యం తక్కువగా ఉంది.

వాయు కాలుష్యంపై టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ స్పందించారు. భయం లేకుండా జీవించే అవకాశం భవిష్యత్‌ తరాలకు ఇవ్వాలంటే.. కాలుష్యాన్ని నివారించే చర్యలు వెంటనే చేపట్టాలన్నాడు. ముంబైలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్ తర్వాత జో రూట్‌ మాట్లాడుతూ… ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా అని తెలిపాడు. ముంబైలో వాయు కాలుష్యం సమస్యను సుమోటోగా స్వీకరించిన బాంబే హై కోర్టు గాలి నాణ్యత తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేసింది.