Leading News Portal in Telugu

Virat Kohli Fan: విరాట్ కోహ్లీపై అభిమానం.. 88 శాతం తగ్గింపుతో రూ. 7కే బిర్యాని! ఎక్కడో తెలుసా?


Virat Kohli Fan: విరాట్ కోహ్లీపై అభిమానం.. 88 శాతం తగ్గింపుతో రూ. 7కే బిర్యాని! ఎక్కడో తెలుసా?

Virat Kohli Fan gives biryani just RS 7 in Uttar Pradesh: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. ప్రాంతాలతో సంబంధం లేకుండా అంతటా కోహ్లీకి అభిమానులు ఉంటారు. తన అభిమాన క్రికెటర్ కోహ్లీని కలవాలని కొందరు, ఓ సెల్ఫీ తీసుకోవాలని మరికొందరు చూస్తుంటారు. అయితే ఓ అభిమాని మాత్రం అందుకు బిన్నంగా రూ. 7కే బిర్యానిని అందించాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని నాన్-వెజ్ బిర్యాని షాప్ (మక్బుల్ బిర్యాని) యజమాని మహ్మద్ డానిష్ రిజ్వాన్.. విరాట్ కోహ్లీకి పెద్ద అభిమాని. ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 88 పరుగులు చేసిన నేపథ్యంలో రిజ్వాన్ తన హోటల్‌లోని అన్ని వంటకాలపై 88 శాతం తగ్గింపు ప్రకటించాడు. విరాట్ చేసిన పరుగుల సంఖ్యకు సమానమైన తగ్గింపు ఆఫర్ ప్రకటించడంతో రిజ్వాన్ హోటల్‌కు జనాలు క్యూ కట్టారు. దాంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

గురువారం మహ్మద్ డానిష్ రిజ్వాన్ తన హోటల్ ముందు ‘మక్బుల్ బిర్యానీస్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఆఫర్’ అనే బ్యానర్‌ను ఉంచాడు. ఇది అక్కడి జనాలను ఆకర్షించింది. రిజ్వాన్ ప్రకటించిన ఆఫర్‌తో రూ. 60 రూపాయల నాన్-వెజ్ బిర్యాని కేవలం రూ. 7కే కస్టమర్లకు దక్కింది. అయితే రిజ్వాన్ ఆఫర్‌ను పొందడానికి కస్టమర్లు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలట. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో ఏ జట్టుతోనైనా భారత్ ఆడే మ్యాచ్‌లకు ఇలాంటి ఆఫర్ కొనసాగుతుందని రిజ్వాన్ చెప్పాడు.

ప్రపంచకప్‌ 2023లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ స్కోర్ చేస్తే.. తన కస్టమర్లకు రెండు ప్లేట్ల బిర్యానీని ఫ్రీగా అందిస్తా అని మహ్మద్ డానిష్ రిజ్వాన్ తెలిపాడు. గురువారం నాటి ఆఫర్ కోసం ఇప్పటికే అనేక మంది కస్టమర్లు తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారని చెప్పాడు. దాదాపు 200 మంది గురువారం డిస్కౌంట్ ధరలో బిర్యానీని పొందుతారని, 180 మంది కస్టమర్‌లు ఆఫర్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారని రిజ్వాన్ పేర్కొన్నాడు.