
Mohammed Shami’s ball on head gesture is for India Bowling Coach: టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ వన్డే ప్రపంచకప్ 2023లో చెలరేగుతున్న విషయం తెలిసిందే. బుల్లెట్ బంతులతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లో ఏకంగా 14 వికెట్స్ పడగొట్టాడు. ఇందులో రెండుసార్లు 5 వికెట్ల ప్రదర్శన ఉండడం విశేషం. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టి.. ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్స్ పడగొట్టిన భారత బౌలర్‌గా ఆల్‌టైమ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం షమీ పేరు నెట్టింట మార్మోగిపోతోంది.
ముంబైలోని వాంఖడే మైదానంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఐదో వికెట్ పడగొట్టిన అనంతరం మహమ్మద్ షమీ వినూత్నంగా సంబరాలు చేసుకున్నాడు. భారత డ్రెస్సింగ్ రూమ్ వైపు నిలబడి.. బంతితో తన తలను రుద్ది ఏవో సైగలు చేశాడు. షమీ సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తలపాగను ఉద్దేశించి.. షమీ ఈ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడని నెటిజన్స్ అభిప్రాయపడ్డారు. మ్యాచ్ అనంతరం ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.
మహమ్మద్ షమీ వినూత్నంగా సంబరాలు హర్భజన్ సింగ్ కోసం కాదని, భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కోసమే అని శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు. భారత్ విజయం అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో గిల్ మాట్లాడుతూ… ‘మహమ్మద్ షమీ చేసిన సైగలు హర్భజన్ సింగ్ తలపాగను ఉద్దేశించి చేసినవి కావు. మా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కోసం. జట్టులో జుట్టు లేకుండా ఉండేది అతడు మాత్రమే. అందుకే షమీ బోడి గుండు సైగలు చేశాడు’ అని గిల్ చెప్పాడు. ఇక భారత్ వరుస విజయలతో సెమీస్ బెర్త్ దక్కించుకుంది. తదుపరి మ్యాచులో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.