
ODI World Cup 2023 BAN vs SL Match in doubt due to Delhi Air Pollution: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్‌పై నీలినీడలు అలుముకున్నాయి. ఢిల్లీలోని తీవ్ర వాయు కాలుష్యం కారణంగా బంగ్లా-శ్రీలంక మ్యాచ్ జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆటగాళ్ల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మ్యాచ్ నిర్వహించడంపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ స్పష్టం చేసింది. మరోవైపు ఢిల్లీలోని పరిస్థితిని బీసీసీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.
గత కొన్ని రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. ఆదివారం ఉదయం 7 గంటలకు ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 460గా నమోదైంది. అంటే ఇది చాలా భయంకరమైన పరిస్థితి. సోమవారం కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఆదివారం బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తమ ప్రాక్టీస్‌ను రద్దు చేసుకున్నాయి. లంక టీమ్ శనివారం పూర్తిగా ఇండోర్స్‌కే పరిమితం అయింది. బంగ్లా ప్లేయర్స్ మాత్రం సాయంత్రం మాస్కులు ధరించి సాధన చేశారు. ఇక శుక్రవారం బంగ్లా జట్టు తమ తొలి ట్రెయినింగ్ సెషన్‌ను రద్దు చేసుకుంది.
ఢిల్లీలో వాయు కాలుష్యం నేపథ్యంలో నేడు బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్ జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నేడు మ్యాచ్ నిర్వహణపై ఐసీసీ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు ఢిల్లీలోని పరిస్థితిని అంచనా వేయడం కోసం ప్రఖ్యాత పల్మనాలజిస్ట్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా సాయంను బీసీసీఐ కోరింది. ఐసీసీ నిబంధనల ప్రకారం మైదానం, వాతావరణం లేదా ఇతర పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని అంపైర్లు భావిస్తే.. మ్యాచ్ నిర్వహణపై వారే నిర్ణయం (మ్యాచ్ ఆపొచ్చు లేదా ఆరంభించకుండానే ఉండొచ్చు) తీసుకునే అధికారం ఉంటుంది.