
BAN vs SL: వరల్డ్ కప్ 2023లో భాగంగా ఢిల్లీలో బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంకను ఓడించి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో బంగ్లాదేశ్ తొలిసారిగా శ్రీలంకను ఓడించింది. బంగ్లా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. 41.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ షాంతో అత్యధికంగా 90 పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ షకీబ్ ఉల్ హసన్ 82 పరుగులతో రాణించాడు. లిటన్ దాస్ 23, మహ్మదుల్లా 22, హృదోయ్ 15 పరుగులతో రాణించారు. ఇక శ్రీలంక బౌలర్లలో అత్యధికంగా మధుషంక 3 వికెట్లు పడగొట్టాడు. మహేష్ తీక్షణ, మాథ్యూస్ తలో రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో అసలంక సెంచరీ వృధా అయిపోయింది. ఓపెనర్ నిస్సాంకా 41 పరుగులు, సమరవిక్రమ 41, డి సిల్వ 34, తీక్షణ 22 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అత్యధికంగా తంజీమ్ హసన్ శకీబ్ 3 వికెట్లు పడగొట్టాడు. షోరిఫుల్ ఇస్లాం, షకీబ్ ఉల్ హసన్ తలో రెండు వికెట్లు సంపాదించారు. మెహిదీ హసన్ మిరాజ్ ఒక వికెట్ సాధించాడు. మరోవైపు శ్రీలంక ఈ ఓటమితో వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.