
Afghanistan Captain Hashmatullah Shahidi Hails Indian Fans: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో పసికూన అఫ్గానిస్థాన్ అంచనాలకు మించి రాణిస్తోంది. మెగా టోర్నీని మామూలుగానే ఆరంభించిన అఫ్గాన్.. ఆ తర్వాత అనూహ్య ప్రదర్శనతో చెలరేగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో పాటు మాజీ ఛాంపియన్స్ పాకిస్థాన్, శ్రీలంకకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో నాలుగు గెలిచి.. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మిగిలిన 2 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో అఫ్గాన్ ఆడాల్సి ఉంది. రెండు మ్యాచ్‌లలో గెలిస్తే అఫ్గాన్ సెమీస్ చేరుతుంది.
ప్రపంచకప్ 2023లో అఫ్గానిస్థాన్ రాణించడానికి భారత అభిమానుల మద్దతే కారణమని కెప్టెన్ హష్మతుల్లా షాహిది తెలిపాడు. మైదానంలోనే కాదు బయట కూడా ఫాన్స్ తమని ఎంతో గౌరవిస్తున్నారని చెప్పాడు. భారత అభిమానులకు తాము రుణపడి ఉంటామని అఫ్గాన్ కెప్టెన్ పేర్కొన్నాడు. ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు ఆస్ట్రేలియాతో అఫ్గానిస్థాన్ తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హష్మతుల్లా షాహిది పలు విషయాలపై స్పందించాడు.
‘ప్రపంచకప్ 2023లో మా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాం. భారత అభిమానులు ఇచ్చిన మద్దతు వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. అఫ్గాన్ ఆడిన ప్రతి మ్యాచ్‌కు భారీగా స్థాయిలో ఫాన్స్ స్టేడియానికి వచ్చి.. మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది మాకెంతో స్ఫూర్తినిస్తోంది. మైదానంలోనే కాదు బయటకు వెళ్లినా గౌరవిస్తున్నారు. ఓ ట్యాక్సీ డ్రైవర్ నన్ను బయటకు తీసుకెళ్లి డబ్బులు కూడా తీసుకోలేదు. ప్రపంచకప్‌లో ఇదివరకు ఒకే మ్యాచ్ గెలిచాం. ఈసారి కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తామనే నమ్మకంతో బరిలో దిగాం. సెమీస్ మా లక్ష్యం’ అని హష్మతుల్లా షాహిది చెప్పాడు.