Leading News Portal in Telugu

NZ vs SL: లంక ఖాతాలో మరో ఓటమి.. కివీస్ ఘన విజయం


NZ vs SL: లంక ఖాతాలో మరో ఓటమి.. కివీస్ ఘన విజయం

వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కివీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో శ్రీలంక ఖాతాలో మరో ఓటమి నమోదైంది. మరోవైపు న్యూజిలాండ్ కు ఈ విజయంతో సెమీస్ అవకాశాలు మరింత బలమయ్యాయి. అయితే అఫ్గానిస్తాన్‌- దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ల ఫలితాల తర్వాత సెమీస్‌కు వచ్చే నాలుగో జట్టు ఏదో అధికారికంగా తేలిపోతుంది.

172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 23.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రీలంక నిర్దేశించిన 171 పరుగులు చేధించేందుకు న్యూజిలాండ్‌కు శుభారంభం లభించింది. న్యూజిలాండ్ ఓపెనర్లు డ్వేన్ కాన్వే, రచిన్ రవీంద్ర తొలి వికెట్‌కు 12.2 ఓవర్లలో 86 పరుగులు సాధించారు. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ 14 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ 43, మార్క్ చాప్‌మన్ 7, టామ్ లాథమ్ 2 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో మ్యాథ్యూస్ 2 వికెట్లు తీయగా.. మహేష్ తీక్షణ ఒక వికెట్ పడగొట్టాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక జట్టు 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక తరఫున కుశాల్ పెరీరా(51) ఒక్కడే యాభై పరుగుల మార్కును దాటాడు. మిగతా బ్యాట్స్‌మెన్లు అందరూ నిరాశపరిచారు. చివర్లో మహేష్ తీక్షణ 91 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఇక కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టగా.. లాకీ ఫెర్గూసన్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో 2 వికెట్లు తీశారు. టిమ్ సౌథీ ఒక్క వికెట్ సాధించాడు.