Leading News Portal in Telugu

Rachin Ravindra: రచిన్ రవీంద్రకు దిష్టి తీసిన బామ్మ.. వీడియో వైరల్!


Rachin Ravindra: రచిన్ రవీంద్రకు దిష్టి తీసిన బామ్మ.. వీడియో వైరల్!

Rachin Ravindra at his grandparents home in Bengaluru: వన్డే ప్రపంచకప్‌ 2023లో తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్‌ భారీ విజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీస్‌ బెర్తును కివీస్ దాదాపు ఖరారు చేసుకుంది. శ్రీలంకపై బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రచిన్ రవీంద్ర.. లక్ష్య ఛేదనలో 42 పరుగులు చేశాడు. శ్రీలంకపైనే కాకుండా.. టోర్నీలో రచిన్‌ కీలక పాత్ర పోషించాడు. దూకుడుగా పరుగులు చేస్తూ.. జట్టుకు అవసరమైనప్పుడు బంతితో మెరుస్తున్న రచిన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే లంక మ్యాచ్ అనంతరం రచిన్‌కు వింత అనుభవం ఎదురైంది.

శ్రీలంకతో మ్యాచ్‌ ముగిసిన అనంతరం బెంగళూరులోని తన తాతయ్య ఇంటికి రచిన్ రవీంద్ర వెళ్లాడు. అక్కడ రచిన్‌కు అతని బామ్మ దిష్టి తీసింది. దిష్టి తీయడానికి బామ్మ చాలా సమయం తీసుకోవడంతో అతడు అలానే కూర్చుండిపోయాడు. రచిన్‌ భారత సంతతికి చెందినవాడే అయినప్పటికీ.. న్యూజిలాండ్‌లోనే పుట్టి పెరిగడంతో ఇదంతా కొత్తగా అనిపించింది. ఇది అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. బెంగళూరు మైదానంలో అభిమానుల నోట రచిన్ పేరు మార్మోగిపోయింది.

‘మా నాన్న తరఫు బంధువులు బెంగళూరులో ఉన్నారు. ఇక్కడ మ్యాచ్‌ ఆడటం ఆనందంగా ఉంది. ఇక్కడి అభిమానుల నుంచి ఇలాంటి స్థాయిలో మద్దతు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఇదంతా నమ్మశక్యంగా లేదు. క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తానని కలలో కూడా అనుకోలేదు. గత ఆరు వరకు నేను ప్రపంచకప్‌ 2023 ఫ్రేమ్‌లోనే లేను. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. ఇక్కడి వరకు వచ్చా. బెంగళూరు పిచ్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌కు అద్భుతంగా ఉంది. నేను యువకుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రాక్టీస్‌ చేసిన అనుభవం పనికొచ్చింది’ అని రచిన్ రవీంద్ర చెప్పాడు.