Rohit Sharma React on India Defeat on CWC FInal 2023 vs Australia: ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ అసాధారణ బ్యాటింగే టీమిండియాకు వన్డే ప్రపంచకప్‌ను దూరం చేసిందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. బ్యాటింగ్ వైఫల్యం తమ ఓటమికి ప్రధాన కారణమని, 20-30 పరుగులు అదనంగా చేసుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. ప్రపంచకప్ 2023లో జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని, అయితే ఫైనల్లో ఫలితం ఇలా ఉండాల్సింది కాదని రోహిత్ పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ భావోద్వేగం చెందాడు.
‘ఈరోజు ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. ఫైనల్ మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాం. మేము ప్రతిదీ ప్రయత్నించాము కానీ కుదరలేదు. మరో 20-30 పరుగులు చేసుంటే బాగుండేది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 270-280 స్కోరు పక్కా అనుకున్నాం. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయాం. స్కోర్ బోర్డ్‌లో 240 పరుగులు ఉన్నపుడు త్వరగా వికెట్లు తీయాలి. మేము ఆరంభంలో వికెట్స్ తీసినా.. ఆ తర్వాత తేలిపోయాం’ అని రోహిత్ శర్మ తెలిపాడు.
Also Read: Earthquake in Maharashtra: మహారాష్ట్రలో భూకంపం..రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదు
‘మూడు వికెట్లు పడిన తర్వాత ఆస్ట్రేలియా పెద్ద భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్లకు పూర్తి ఘనత దక్కుతుంది. మా నుంచి ఈ ఇద్దరు మ్యాచ్‌ను దూరం చేశారు. మేము చేయగలిగినదంతా ప్రయత్నించాము కానీ ఫ్లడ్‌లైట్ల కింద పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని తెలుసు. కానీ దీన్ని సాకుగా చూపించలేను. మేము బోర్డు మీద తగినంత పరుగులు చేయలేదు. ఛేదనలో 3 వికెట్లు తర్వాత మరో వికెట్ తీయాల్సింది. ఫైనల్లో మేం స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేయలేదు. అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన హెడ్, లబుషేన్లకు ఈ క్రెడిట్ దక్కుతుంది’ అని రోహిత్ చెప్పాడు.