Leading News Portal in Telugu

Cricket: 2027 వన్డే ప్రపంచకప్‌లో ఈ స్టార్ క్రికెటర్లు ఆడటం కష్టమే..!



Star Players

ప్రపంచ వ్యాప్తంగా 45 రోజులపాటు వరల్డ్ కప్ ఫీవర్ కొనసాగింది. స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో భారత్ ఫైనల్ వరకు వచ్చి ఆసీస్ చేతిలో ఓడిపోయింది. ఈసారి టైటిల్ గెలుస్తారన్న నమ్మకంతో ఉన్న టీమిండియా అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఎట్టకేలకు వరల్డ్ కప్ మహా సంగ్రామం ముగిసిపోయింది. దీంతో తర్వాత వరల్డ్ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. వచ్చే వరల్డ్ కప్ లో కొందరు స్టార్ ఆటగాళ్లు దూరంకానున్నారు. ఆ టోర్నీలో వారు ఆడటం కష్టమనే చెప్పవచ్చు. అందులో టీమిండియాకు చెందిన కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాకు చెందిన పలువురు ఆటగాళ్లు ఉన్నారు. అయితే వారెవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Tesla: భారతీయులకు అందుబాటు ధరలోనే టెస్లా కారు.. ధర ఎంతంటే..?

క్వింటన్ డి కాక్
దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ ఈ ప్రపంచకప్ ప్రారంభానికి ముందే.. ప్రపంచకప్ 2023 ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో డికాక్ అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించడు.. అంతేకాకుండా ప్రపంచ కప్‌ 2027లో కూడా చూడలేము. క్వింటన్ డికాక్.. వన్డే ఫార్మాట్‌లో 155 మ్యాచ్‌లలో 45.74 సగటుతో, 96.64 స్ట్రైక్ రేట్‌తో 6,770 పరుగులు చేశాడు. అందులో 21 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రపంచ కప్‌ 2023లో 10 మ్యాచ్‌లలో 59.40 సగటుతో మొత్తం 594 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి.

రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వన్డే ప్రపంచ కప్ 2023 చివరిది కావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అతని వయస్సు 37 సంవత్సరాలు ఉంది. వచ్చే వన్డే ప్రపంచకప్ నాటికి రోహిత్‌కు 40-41 ఏళ్లు నిండుతాయని, ఆ వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడడం చాలా కష్టం. అయితే అతని కెరీర్ లో చివరి వరల్డ్ కప్ సాధించడంలో విఫలం కావడంతో రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాగా.. రోహిత్ శర్మ వన్డే కెరీర్‌లో 262 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 49.12 సగటుతో 10,709 పరుగులు చేశాడు. అందులో 31 సెంచరీలు, 55 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2023 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ 11 మ్యాచ్‌లలో 597 పరుగులు చేశాడు.

మహ్మద్ షమీ
టీమిండియా ఫాస్ట్ బౌలర్ 2023 ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. అయితే షమీకి కూడా 2023 వరల్డ్ కప్ చివరి కావచ్చు. ఈ ప్రపంచకప్‌లో షమీ కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అద్భుతమైన బౌలింగ్ సగటు 10.70, ఎకానమీ రేట్ 5.26తో మొత్తం 24 వికెట్లు తీశాడు. అందులో ఐదు వికెట్లు మూడుసార్లు, నాలుగు వికెట్లు ఒకసారి తీసిన ఘనత సాధించాడు. షమీ తన వన్డే కెరీర్‌లో మొత్తం 101 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 23.68 సగటుతో, 5.55 ఎకానమీ రేటుతో మొత్తం 195 వికెట్లు తీసుకున్నాడు. అందులో 5 సార్లు 5 వికెట్లు, 10 సార్లు 4 వికెట్లు తీశాడు.

డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ కు కూడా.. 2023 ప్రపంచకప్ చివరి వన్డే ప్రపంచకప్ కావచ్చు. వార్నర్ వయసు ప్రస్తుతం 37 ఏళ్లు ఉంది. 2027 ప్రపంచకప్ నాటికి అతడికి 41 ఏళ్లు నిండుతాయి. దీంతో అప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడటం చాలా కష్టం. 2023 ప్రపంచకప్‌లో వార్నర్ అద్భుత ప్రదర్శన చేసి, అత్యధిక పరుగులు చేసిన ఆరవ ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ మొత్తం 11 మ్యాచ్‌లలో 48.63 సగటుతో, 108.29 స్ట్రైక్ రేట్‌తో 535 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. వార్నర్ తన వన్డే కెరీర్‌లో మొత్తం 161 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 45.30 సగటుతో, 97.26 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 6,932 పరుగులు చేశాడు. అందులో 22 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

స్టీవ్ స్మిత్
ఈ జాబితాలో మరో ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్ పేరు కూడా చేరింది. 34 ఏళ్ల స్మిత్‌కి తదుపరి వన్డే ప్రపంచకప్‌ ఆడడం కష్టమే. 2023 వన్డే ప్రపంచకప్ లో మంచి ప్రదర్శన చూపించాడు. 10 మ్యాచ్‌లలో 10 ఇన్నింగ్స్‌లలో 37.50 సగటుతో మొత్తం 302 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 1 అర్ధ సెంచరీ ఉంది. కాగా.. స్మిత్ తన వన్డే కెరీర్‌లో మొత్తం 155 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 139 ఇన్నింగ్స్‌లలో 43.54 సగటు, 87.25 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 5,356 పరుగులు చేశాడు. అందులో అతను 12 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు చేశాడు.

షకీబ్ అల్ హసన్
2023 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన షకీబ్ అల్ హసన్ తదుపరి ప్రపంచకప్ ఆడడం దాదాపు అసాధ్యం. 36 ఏళ్ల షకీబ్‌కి 2027 ప్రపంచకప్ నాటికి అతని వయసు దాదాపు 41 ఏళ్లు అవుతుంది. అందువల్ల వచ్చే ప్రపంచకప్‌లో ఆడడం కష్టమే అయినా రానున్న కొద్ది నెలల్లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకవచ్చు. ఇదిలా ఉంటే.. ఈ ప్రపంచకప్‌లో షకీబ్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్ జట్టు బాగా రాణించలేకపోయింది. అంతేకాకుండా.. షకీబ్ కూడా పెద్దగా ఆడలేకపోయాడు. కాగా.. ఆల్ రౌండర్ షకీబ్ 247 వన్డే మ్యాచ్‌లలో 37.29 సగటుతో 7,570 పరుగులు చేశాడు. అందులో అతను 9 సెంచరీలు, 56 అర్ధ సెంచరీలు చేశాడు. ఇక.. బౌలింగ్‌లో 29.52 సగటుతో 317 వికెట్లు తీశాడు.

బెన్ స్టోక్స్
32 ఏళ్ల ఇంగ్లీష్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఈ ప్రపంచ కప్‌కు ముందు వన్డే ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యాడు. అయితే స్టోక్స్ ఈ ప్రపంచ కప్ కోసం రిటైర్మెంట్ నుండి వెనక్కి తీసుకున్నాడు. ఈ క్రమంలో తదుపరి వన్డే ప్రపంచకప్‌లో అతను ఆడడం అసాధ్యం. బెన్ స్టోక్స్ ఈ ప్రపంచ కప్‌లో మొదటి కొన్ని మ్యాచ్‌లు బాగా ఆడలేకపోయాడు. కానీ కొన్ని మ్యాచ్‌లలో కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడి తన జట్టును విజయపథంలో నడిపించాడు. బెన్ స్టోక్స్ తన వన్డే కెరీర్‌లో 3,463 పరుగులు, 74 వికెట్లు సాధించాడు.