
IPL Team Gujarat Titans Retentions List: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడనున్నాడు. గుజరాత్ టైటాన్స్ రిటైన్ ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం హార్దిక్ పేరు ఉన్నప్పటికీ.. డిసెంబర్ 12 వరకు ట్రేడింగ్ జరుగనుండడంతో అతడు ముంబైకి మారనున్నాడని సమాచారం తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఐపీఎల్లో ఇదే అతిపెద్ద డీల్‌గా చెప్పుకోవచ్చు.
ఐపీఎల్ 2024 మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరుగనున్నది. అంతకుముందే గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ట్రేడింగ్ జరగనుందట. ఈ ట్రేడింగ్‌లో హార్దిక్ గుజరాత్ నుంచి ముంబై మారనున్నాడని తెలుస్తోంది. ఈ విషయమై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. చూడాలి మరి హార్దిక్ గుజరాత్‌తోనే ఉంటాడా? లేదా ముంబైకి మారుతాడా?. 2015లో ముంబైతో ఐపీఎల్ కెరీర్ ఆరంభించిన హార్దిక్.. నాలుగుసార్లు టైటిల్ సాధించిన జట్టులో ఉన్నాడు. 2022లో టైటాన్స్‌కు మారి కెప్టెన్‌గా టైటిల్ అందించాడు. గత యేడాది గుజరాత్ రన్నరప్‌గా నిలిచింది.
గుజరాత్ టైటాన్స్ 8 మంది ఆటగాళ్లను మాత్రమే రిలీజ్ చేసింది. తెలుగు తేజం కేఎస్ భరత్‌కు టైటాన్స్ ఉద్వాసన పలికింది. యశ్ దయాల్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ప్రదీప్ సంగ్వాన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, డసన్ షనకలకు కూడా గుడ్‌బై చెప్పింది. దాదాపు కోర్ టీమ్ మొత్తాన్ని టైటాన్స్ రిటైన్ చేసుకుంది.
గుజరాత్ టైటాన్స్ రిటైన్ లిస్ట్:
డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, వృద్దిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నలకందే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తేవాటియా, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జోషువా లిటిల్, మోహిత్ శర్మ.